అదనంగా మరో 1, 800 గ్రామ సచివాలయాలు.. మరింత పెరగనున్న ఉద్యోగాలు!
గ్రామ సచివాలయాల ఏర్పాటుచేసి ప్రజలకు మరింత మెరుగైన పాలన అందజేస్తామని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఒక్కో గ్రామ సచివాలయంలో పది మంది ఉద్యోగులు నియమించనున్నారు. ఈమేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఇందులో కొన్ని అంశాలు అస్పష్టంగా ఉండటంతో శనివారం వీటిపై మరింత స్పష్టత ఇచ్చింది. పంచాయతీకి ఒకటి చొప్పున మొత్తం 13,065 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రెండు వేల కంటే అదనపు జనాభా కలిగిన పంచాయతీల్లో అనుంబంధ సచివాలయాలు ఏర్పాటుచేస్తామని తెలిపింది. దీంతో అదనంగా మరో 1,800 అనుబంధ సచివాలయాలు రాబోతున్నాయి. విధి విధానాల ప్రకారం ప్రస్తుతం ఉన్న ప్రతి పంచాయతీ ఆఫీసును సచివాలయంగా గుర్తిస్తారు. పెద్ద పంచాయతీల్లో 2 వేల కంటే ఎక్కువ జనాభా ఉంటే అక్కడ మళ్లీ రెండు వేల మందికి ఒకటి చొప్పున అనుబంధ సచివాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సెక్రటేరియట్‌లో అసిస్టెంట్ సెక్రెటరీతో కలిపి పది మంది ఉద్యోగులు సేవలు అందిస్తాయి. ఈ అనుబంధ సచివాలయాలు పంచాయతీ ప్రధాన సచివాలయ కార్యదర్శి పరిధిలోనే పని చేస్తాయి. ఇక, అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయాలు ప్రారంభమవుతాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 13,550 గ్రామ పంచాయతీలుండగా 9,480 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాలని భావించారు. మొత్తం 13,550 పంచాయతీల్లో ఒకే గ్రామంతో కూడిన గ్రామ సచివాలయాలు 6,168 కాగా, ఒకటికి మించిన పంచాయతీలతో 3,312 ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం వెల్లడించారు. అయితే, వీటిపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అదనంగా గ్రామ సచివాలయం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ కార్యాలయాల్లో ఉద్యోగాలను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా భర్తీ చేస్తారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా.. పారదర్శకంగా నియామకాలు చేపట్టాలన్న సీఎం ఆదేశాలతో చర్యలకు అధికారులు ఉపక్రమించారు. ఉద్యోగానికి ఎంపికైన వారికి ఏ పని అప్పగించినా సమర్థవంతంగా చేసేలా తీర్చిదిద్దాలని జగన్ సూచించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలన్న విషయం ప్రతి ఒక్కరికీ స్పష్టంగా తెలిసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,114 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ శుక్రవారం పేర్కొంది. మొత్తం 11 విభాగాలతో 91,652 మంది ఉద్యోగులను నియమించనున్నట్టు తెలిపింది. ఇప్పటికే 14,098 మంది సిబ్బంది అందుబాటులో ఉండటంతో మిగిలిన 77,554 మంది సిబ్బందిని కొత్తగా నియమించనున్నారు.
By July 21, 2019 at 08:01AM
No comments