Breaking News

హైదరాబాద్: ఓ విద్యార్థి లిఫ్ట్ అడిగితే అతడికి ఊహించని బహుమతి ఇచ్చిన కమిషనర్!


తల్లిదండ్రులు పేదవాళ్లు కావడంతో చదువుకోవాలనే సంకల్పంతో ఓ బాలుడు రోజూ మూడు కిలోమీటర్ల నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో పలువుర్ని లిఫ్ట్ అడుగుతూ స్కూల్‌కు చేరుకుంటాడు. అయితే, శుక్రవారం కూడా ఇంటి నుంచి బయలుదేరిన ఆ విద్యార్థి ఓ కారును లిఫ్ట్ అడిగాడు. కారులోని వ్యక్తి తన వాహనం ఆపి విద్యార్థిని ఎక్కించుకున్నాడు. బాలుడి కుటుంబ వివరాల గురించి తెలుసుకున్న ఆయన, సాయంత్రం ఆ విద్యార్థికి సైకిల్ అందజేశాడు. దీంతో ఆ బాలుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఈ ఆసక్తిర ఘటన రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ పరిధిలో చోటుచేసుకోగా, ఆ విద్యార్థికి సైకిల్ కొనిచ్చిన ఆయన ఇంఛార్జ్ కమిషనర్ కావడం విశేషం. ఎప్పట్లాగే శుక్రవారం తన ఇంటి నుంచి పాఠశాలకు బయలుదేరిన ప్రభుతేజ్ అనే విద్యార్థి కొంత దూరం తర్వాత ఓ కారును లిఫ్ట్‌ అడిగాడు. అతడిని చూసిన కారులోని వ్యక్తి వాహనం ఆపి ఎక్కించుకున్నాడు. విద్యార్థి సంతోషంతో అంకుల్‌ ‘నేను నా జీవితంలో తొలిసారి కారులో వెళ్తాన్నాను’ అని తన అనుభూతిని పంచుకున్నాడు. అయితే, ఆ కారులోని వ్యక్తి జవహర్‌నగర్‌ మున్సిపల్‌ ఇన్‌ఛార్జి కమిషనర్‌ రఘు అని ప్రభుకి తెలియదు. విద్యార్థి కుటుంబ పరిస్థితులపై కమిషనర్ ఆరా తీయగా, తన పేరు ప్రభుతేజ అని.. బాలాజీనగర్‌ గవర్నమెంట్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నట్టు తెలిపాడు. తన తండ్రి చంద్రయ్యకు కంటి చూపులేకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటారని, తల్లి లలిత కిడ్నీ సమస్యతో బాధపడుతూనే ఇళ్లలో పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుందని చెప్పాడు. తనకు ఓ తమ్ముడు సైతం ఉన్నాడని ప్రభుతేజ వివరించాడు. విద్యార్థి పరిస్థితి విని చలించిపోయిన కమిషనర్ ప్రభుతేజ తల్లికి జవహర్‌నగర్‌ మున్సిపాల్టీ పరిధిలో ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఉన్నతాధికారులతో మాట్లాడి కుటుంబానికి సాయంచేయడానికి అన్ని విధాలుగా సహకరిస్తానని అన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రభుతేజ్ చదువుతోన్న పాఠశాలకు వెళ్లి తాను తెప్పించిన సైకిల్‌ను విద్యార్థికి అందజేశారు. ఊహించని ఈ బహుమతికి బాలుడు శంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. ఈ సందర్భంగా ప్రభుతేజ్ మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కష్టపడి చదువుతానని, సైన్యంలో చేరి దేశానికి సేవ చేస్తానని, ఆ తర్వాత కారు కొంటానని అన్నాడు. రోజూ మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ స్కూల్‌కు వెళ్తున్నా, చదువుపై ఉన్న ఇష్టంతో ఎలాంటి బాధ అనిపించడం లేదని వ్యాఖ్యానించాడు. అనుకోని విధంగా కమిషనర్‌ తన కారులో లిఫ్ట్‌ ఇచ్చి నాకు సైకిల్‌ బహుమతిగా ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని, బాగా చదువకుని లక్ష్యాన్ని సాధిస్తానని పేర్కొన్నాడు.


By June 23, 2019 at 11:05AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/jawaharnagar-municipal-commissioner-raghu-gifted-bicycle-to-a-poor-student/articleshow/69911535.cms

No comments