Breaking News

రైతు దినోత్సవంగా వైఎస్ జయంతి.. ఆ రోజే కీలక పథకాలు ప్రారంభం


దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పుట్టిన రోజును (జులై 8) రైతు దినోత్సవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిలో జరుగుతోన్న కలెక్టర్ల సదస్సులో ఈ మేరకు సీఎం జగన్ ప్రకటించారు. ఆ రోజు నుంచే పెంచిన సామాజిక పింఛన్లను పంపిణీ, రైతులకు వడ్డీలేని పంట రుణాలు, వైఎస్సార్‌ బీమా వంటి పథకాలను ప్రారంభిస్తామని జగన్‌ వెల్లడించారు. సామాజిక పింఛన్లను వైసీపీ ప్రభుత్వం రూ.2 వేల నుంచి రూ.2,250కు పెంచిందన్న అభిప్రాయంతో చాలా మంది ఉన్నారని సీఎం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల తొమ్మిది నెలల వరకు రూ.1,000 ఇచ్చారని, ఎన్నికలను దృష్ట్యిలో ఉంచుకుని దానిని రూ.2,000కు పెంచారన్నారు. మన ప్రభుత్వం రూ.1,000 ఉన్న పింఛనును రూ.2250 చేసిందని, దీన్ని పెంచుకుంటూ వెళ్లి నాలుగేళ్లలో రూ.3,000 చేస్తామని, దీన్నే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జగన్‌ స్పష్టం చేశారు. వీటితోపాటు విజయవాడలో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు కాజ- చినఔటుపల్లి బైపాస్‌ రహదారి నిర్మాణం రెండు నెలల్లో ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. అలాగే విజయవాడలో కనకదుర్గమ్మ, బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్ పనులు ఆరు నెలల్లో పూర్తిచేయాలని సూచించారు. పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో గడువులోగా ప్రాజెక్టు చేపట్టకపోతే వాటిని వెనక్కు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఇలాంటి 42 పరిశ్రమలకు నోటీసులిచ్చినట్టు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌భార్గవ వెల్లడించారు. ఐదేళ్లలో రైతుల నుంచి 13 ప్రభుత్వ, ప్రైవేటు బీమా సంస్థలు ప్రీమియం రూపంలో రూ.40 వేల కోట్లు వసూలు చేశాయని, దీని వల్ల వాటికి రూ.15 వేల కోట్ల లాభం వచ్చిందని జగన్‌ అన్నారు. అయితే, దానికి తగ్గట్టు బీమా కంపెనీలు సేవలందించలేదని, అందుకే రైతులందరికీ బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రాష్ట్రంలో ఒక్కో పౌరుడికి ఒక్కో చెట్టు పథకాన్ని అమల్లోకి తేవాలని, గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేయాలని అటవీ అధికారులను జగన్ ఆదేశించారు.


By June 25, 2019 at 08:40AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-government-decided-will-celebrate-farmers-day-on-former-cm-ysr-birth-anniversary/articleshow/69936304.cms

No comments