Breaking News

ప్రభుత్వ స్కూల్‌‌లో చదివితేనే ధ్రువపత్రాలు.. ఓ గ్రామ పంచాయితీ తీర్మానం!


ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్నాళ్లుకు ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉంది. ఇప్పటికే విద్యార్థులు లేక తెలుగు రాష్ట్రాల్లో పలు పాఠశాలను ప్రభుత్వాలు మూసివేశాయి. విద్యా వ్యవస్థకు వెన్నుముకలా నిలవాల్సిన ప్రభుత్వ పాఠశాలలు చిక్కిపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు బోధిస్తున్నా సౌకర్యాల లేమితో తల్లిదండ్రులు ప్రయివేట్ స్కూల్స్‌వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ గ్రామ పంచాయితీ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు లేక మూతపడుతున్న ప్రభుత్వ బడులను సమష్టిగా కాపాడుకునేందుకు నడుం బిగించింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామపంచాయితీ సోమవారం ఓ తీర్మానం చేసింది. ప్రభుత్వ పాఠశాలలో చదవని విద్యార్థులకు పంచాయితీ తరఫున ఎలాంటి ధ్రుపత్రాలను జారీచేయబోమని అందులో పేర్కొంది. కొత్తగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యుడు వంగ రవీందర్‌, సర్పంచి మాడ్గుల కొమురయ్య ఆధ్వర్యంలో ఈ తీర్మానం చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపించని కుటుంబాలకు గ్రామ పంచాయతీ ధ్రువపత్రాలు, ప్రభుత్వ పథకాలు వర్తించవని స్పష్టం చేశారు. అంతేకాదు, ప్రైవేట్‌ పాఠశాలల వాహనాలను గ్రామంలోకి అనుమతించబోమని పేర్కొన్నారు. గవర్నమెంట్ స్కూల్‌లో ఒకటో తరగతి నుంచి పది వరకు చదవని విద్యార్థులకు గ్రామ పంచాయతీ తరఫున ఎలాంటి ధ్రువపత్రాలు జారీ చేయబోమంటూ ఇంటింటి ప్రచారం చేశారు. తీర్మానం ప్రతిని కరపత్రంలా ముద్రించిన ప్రచారం నిర్వహించారు. ‘ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం వచ్చే ప్రయివేట్ స్కూల్ వాహనాలు అనుమతించబడవని తెలిపారు. మన గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదవని పిల్లలకు గ్రామ పంచాయితీ తరఫున ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వబడవు.. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపనప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల లబ్ది కూడా పొందరాదు’ అంటూ తీర్మానంలో స్పష్టం చేశారు.


By June 25, 2019 at 09:17AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/gram-panchayat-pass-a-resolution-not-issue-certificates-to-who-cant-studying-in-govt-schools/articleshow/69936831.cms

No comments