ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌కు షాక్.. స్టీఫెన్ రవీంద్ర డిప్యుటేషన్‌కు బ్రేక్!

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ డిప్యుటేషన్‌కు బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం సర్వీసు అధికారుల నియామకాలను పర్యవేక్షించే డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్(డీవోపీటీ) విభాగం స్టీఫెన్ రవీంద్ర ఫైల్‌ను పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ కేడర్‌కు చెందిన రవీంద్రను తమకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని బదిలీ చేసిన సంగతి తెలిసిందే. డిప్యుటేషన్‌పై ఏపీకి వెళ్లిన ఆయనకు కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. దీంతో ఆయన వెంటనే విజయవాడలో బాధ్యతలు స్వీకరించడం, అధికారులతో సమావేశం కావడం చకచకా జరిగిపోయాయి. ఇరు రాష్టాలు అంగీకారం తెలపడంతో ఆయన డిప్యుటేషన్‌ను కేంద్రం ఆమోదించడం నామమాత్రమేనని అంతా అనుకున్నారు. అయితే ఆయన డిప్యుటేషన్‌కు సంబంధించిన ఫైలు డీవోపీటీకి వెళ్లి నెలరోజులైనా దానిపై ఎలాంటి కదలిక లేదు. సాంకేతికంగా స్టీఫెన్ రవీంద్ర డిప్యుటేషన్ చెల్లదంటూ కేంద్ర అధికారులు దాన్ని పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా అఖిల భారత సర్వీసు అధికారులను ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి డిప్యుటషన్‌పై పంపించాలంటే బలమైన కారణం ఉండాలి. డిప్యుటేషన్‌పై వెళ్లాలనుకునే అధికారి ప్రస్తుత కేడర్‌లో కనీసం 9ఏళ్ల పనిచేసి ఉండాలి. దీనికి తోడు సూపర్‌టైమ్ స్కేల్ ఉండాలి. ఈ దారి కుదరనప్పుడు ఏదైనా బలమైన కారణం చూపిస్తేనే కేంద్రం డిప్యుటేషన్‌కు అంగీకరిస్తుంది. కానీ స్టీఫెన్ రవీంద్ర డిప్యుటేషన్ ఫైలులో ఇలాంటి కారణాలేమీ చూపలేనట్లుగా తెలుస్తోంది. అందువల్లనే డీవోపీటీ ఆ ఫైలును పక్కన పెట్టేసినట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై తెలుగు రాష్ట్రాల మఖ్యమంత్రుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ప్రధాని స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందని ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
By June 29, 2019 at 08:03AM
No comments