Breaking News

కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద జలసంకల్ప యాగం.. పాల్గొన్న కేసీఆర్ దంపతులు


తెలంగాణలో 45 లక్షల ఎకరాలకు సారునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి మరికాసేపట్లో ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్‌.. అక్కడ నిర్వహిస్తున్న జలసంకల్ప యాగంలో పాల్గొన్నారు. శృంగేరీ పీఠానికి చెందిన ఫణిశశాంక్‌ శర్మ, గోపీకృష్ణ ఆధ్వర్యంలో 40 మంది వేద పండితులు యాగం జరిపిస్తున్నారు. ఈ యాగంలో కేసీఆర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగం పూర్తయిన తర్వాత ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవానికి ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ పాల్గొంటున్నారు. చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతుండటంతో తెలంగాణ ప్రజానీకం సంబురాలు చేసుకుంటోంది. రైతులు, ప్రజలు వేడుకలకు సిద్ధమయ్యారు. కాళేశ్వరం ప్రారంభానికి గోదావరితీరం అన్నిరకాలుగా ముస్తాబైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌కి రుణాలిచ్చిన వివిధ బ్యాంకులకు చెందిన 13 మంది మేనేజింగ్‌ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు, జనరల్‌ మేనేజర్లు కూడా హాజరుకానున్నారు. మరో ముఖ్య ఘట్టమైన కన్నెపల్లి పంపుహౌస్‌ ప్రారంభోత్సవం ఉదయం 11.40కి జరుగుతుంది. నిర్ణయించిన ముహూర్తాలకు అనుగుణంగా ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.


By June 21, 2019 at 10:02AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/telangana-cm-kcr-performs-jala-sankalpa-yagam-at-kaleshwaram-project/articleshow/69885303.cms

No comments