Breaking News

తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించిన నైరుతి.. ఒక్క రోజులోనే ఏపీ అంతటా విస్తరణ!


ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల్లోకి శుక్రవారం ప్రవేశించాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. తొలుత ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించిన రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతూ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించినట్టు అధికారులు తెలిపారు. ఇక, దక్షిణ తెలంగాణతోపాటు తూర్పున ఎల్లారెడ్డి, రామగుండం వరకు విస్తరించాయని వాతావరణ శాఖ డైరెక్టర్ వైకే రెడ్డి వెల్లడించారు. నైరుతి ప్రభావంతో హైదరాబాద్‌తోపాటు, ఏపీలోని పలుచోట్ల శుక్రవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి ఈ ఏడాది 11 రోజులు ఆలస్యంగా తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించినా సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. . ఏపీలో మాత్రం జూన్ 27 వరకు సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించారు. జూన్ 28 నుంచి జులై 7 వరకు రాయలసీమలో సాధారణంగా, కోస్తాలో ఎక్కువగానూ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఈ సీజన్‌లో రుతుపవనాల ఆలస్యం ప్రభావం ఏమాత్రం ఉండదని, 97 శాతం వర్షపాతం (912 మిల్లీమీటర్లు) నమోదు కావచ్చని స్పష్టం చేశారు. కాగా, గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం దాకా విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో అత్యధికంగా 10సెం.మీ వర్షం కురిసింది. పార్వతీపురం, గరివిడి, గజపతినగరం, నర్సీపట్నంలో 8, చీపురుపల్లి, భీమిలిలో 7, పాడేరు, జంగమహేశ్వరపురం, మాచర్లలో 6, ఇచ్ఛాపురంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలో జూన్‌లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. కానీ జులై నెలలో మాత్రం అధిక వర్షాలు కురుస్తాయని తెలిపారు. రుతుపవనాలు ప్రవేశించిన తొలిరోజున తెలంగాణలో 330 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా 8.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.


By June 22, 2019 at 08:11AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/southwest-monsoon-hits-andhra-pradesh-and-telangana/articleshow/69899513.cms

No comments