Breaking News

అక్కడ ఎకరా రూ.12 కోట్లు.. కానీ శారదా పీఠానికి రూపాయికే!


హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు భూమిని కేటాయించాలని విశాఖ శ్రీ శారదా పీఠం 2015, 2018, 2019 జూన్ 22న దరఖాస్తు చేసింది. ఈ వినతిని పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం రెండెకరాల 34 సెంట్లు భూమిని శారదా పీఠానికి కేటాయించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట గ్రామంలో భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం శనివారం జీవోను జారీ చేసింది. దీనికి నామమాత్రపు ధర ఒక్క రూపాయిగా పేర్కొంది. అయితే, దీని విలువ ఎకరాకు రూ.12 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. కోకాపేట గ్రామ సర్వే నంబరు 240లో భూమిని కేటాయిస్తూ జీవో ఎంఎస్‌ నెం.71ని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. శారదాపీఠం ఆధ్వర్యంలో ఆలయం, వేద భాష గోష్ఠి మఠం, సంస్కృత పాఠశాల, విద్యార్థులకు వసతిగృహం, కన్వెన్షన్‌ హాల్ ఏర్పాటు చేసేందుకు తమకు భూమిని కేటాయించాలంటూ విశాఖ శ్రీ శారదా పీఠం ధర్మాధికారి జి.కామేశ్వరశర్మ 2015, 2018లోనూ, మళ్లీ ఈ నెల 22న ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి సీఎంకీ ప్రతిపాదనలు అందడంతో రెండెకరాల భూమిని కేటాయించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంగీకరించారు. కోకాపేట గ్రామం పరిధిలోని సర్వే నంబరు 240లో 316.04 ఎకరాల పోరంబోకు స్థలం ఉంది. ప్రస్తుతం ఇది హైదరాబాద్‌ నగరపాలక అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఆధీనంలో ఉంది. ఇదే లేఅవుట్‌లో ఖాళీగా ఉన్న 2.34 ఎకరాలను పీఠానికి కేటాయించేందుకు ప్రభుత్వం హెచ్‌ఎండీఏ నుంచి వెనక్కు తీసుకుంది. ఇక్కడ ఎకరా స్థలం మార్కెట్‌ విలువ రూ.12 కోట్లు పలుకుతోంది. ఇక, సీఎం కేసీఆర్‌కు విశాఖ శారదా పీఠం, పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతిపై ఎంతటి నమ్మకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండోసారి అధికారంలోకి రావడానికి ఆయన ఆశీస్సులున్నాయి. గతవారం విజయవాడలో శారదా పీఠం ఉత్తరాధికారి బాధ్యతల అప్పగింత కార్యక్రమానికి కూడా హాజరైన కేసీఆర్ ఆశీస్సులు అందుకున్నారు. దీంతో నాలుగు రోజుల కిందట జరిగిన క్యాబినెట్‌లో శారదా పీఠానికి తెలంగాణలో స్థలం కేటాయించాలని నిర్ణయించారు. శారదా పీఠానికి రెండెకరాలు, తెలంగాణ సినీ దర్శకుడు ఎన్.శంకర్‌కు స్టూడియో నిర్మాణం కోసం మోకిళ్ల వద్ద 5 ఎకరాల భూమి ఇవ్వాలని కూడా తీర్మానించారు.


By June 23, 2019 at 08:18AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/telangana-govt-allocated-2-34-acres-land-to-visakha-sri-sharada-peetham/articleshow/69910457.cms

No comments