Breaking News

మా ప్రయాణం ఇలా ముగుస్తుందనుకోలా: ఎన్టీఆర్


హీరోలను స్టార్స్‌ను చేసేది అభిమానులే. ఒక అభిమాని తనకు నచ్చిన హీరోని అభిమానించడం మొదలెడితే.. అతను ఎంత వరకేనా వెళతాడు. పోటీకైనా, గొడవకైనా.. దేనికైనా సరే తన అభిమాన హీరోని ఉన్నతంగా ఉంచాలనే అభిప్రాయంతోనే ఉంటాడు. అలాంటి అభిమానులు వారు అభిమానించే స్టార్స్‌కు చాలా దగ్గరగా ఉంటారని ఈ మధ్య చాలా మంది నిరూపించారు. చిరంజీవి నుంచి సందీప్ కిషన్ వరకు అందరూ అభిమానుల కోసం ఇప్పుడు ప్రత్యేకంగా టైమ్ కేటాయిస్తున్నారు. 

ఈ మధ్య తమ అభిమానులు చనిపోతే అక్కినేని ఫ్యామిలీ హీరోలు ఎంతగా తపించిపోయారో తెలియంది కాదు. ఒక్క అక్కినేని అనే కాదు.. సినిమా ఇండస్ట్రీలో అభిమానులున్న అందరూ నటులు ఇప్పుడు తమ అభిమానుల పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు. అభిమానులు ఆపదలో ఉన్నారని తెలిస్తే.. స్వయంగా వెళ్లి సహాయం చేస్తున్నారు. ఇక అభిమానుల గురించి అత్యున్నతంగా ఆలోచించే హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాడు. తన కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలతో ఎంతగానో వేధన అనుభవించిన ఎన్టీఆర్, తన సినిమాలకు సంబంధించిన ప్రతి ఫంక్షన్‌లో అభిమానులకు జాగ్రత్తలు చెప్పేందుకు ఓ పావుగంట టైమ్ కేటాయిస్తాడు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తన అభిమాన సంఘం ప్రతినిధి చనిపోతే ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యుడినే కోల్పోయినంతగా బాధపడుతున్నాడు. కృష్ణాజిల్లాకు చెందిన జయదేవ్ అనే ఎన్టీఆర్ అభిమాని చనిపోవడంతో.. అతని గురించి ప్రత్యేకంగా ట్వీట్ చేసి.. ఎన్టీఆర్ ఎంతగానో బాధను వ్యక్తం చేశాడు.

‘‘నాకు అత్యంత ఆప్తుడు, కృష్ణాజిల్లా అభిమాన సంఘం ప్ర‌తినిధి జ‌య‌దేవ్ ఇక లేర‌న్న వార్త న‌న్ను తీవ్ర మ‌న‌స్థాపానికి గురి చేసింది. ‘నిన్ను చూడాల‌ని’తో మొద‌లైన మా ప్ర‌యాణం ఇలా అర్థాంత‌రంగా ముగిసిపోతుంద‌ని ఊహించ‌లేదు. న‌టుడిగా నేను చూసిన ఎత్తుప‌ల్లాల్లో నాకు వెన్నంటే ఉన్న‌ది నా అభిమానులు. ఆ అభిమానుల‌తో నేను వేసిన తొలి అడుగు నుంచి నేటి వ‌ర‌కు నాకు తోడుగా ఉన్న‌వారిలో జ‌య‌దేవ్ చాలా ముఖ్య‌మైన‌వారు. జ‌య‌దేవ్ లేని లోటు నాకు తీర‌నిది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటూ ఆయ‌న కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను..’’ అని ఎన్టీయార్ సోషల్ మీడియా ద్వారా తన అభిమాని మృతికి నివాళులు అర్పించాడు.



By May 07, 2019 at 12:54PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45839/jr-ntr.html

No comments