‘మహర్షి’కి, ‘పోకిరి’కి పోలికేంటి మహేష్?
‘మహర్షి’ చిత్రం మంచి మెసేజ్ ఇచ్చిన చిత్రం అనడంలో సందేహం లేదు. ఇందులో రైతుల సమస్యల గురించి ప్రస్తావించిన తీరును ఆయన వ్యతిరేకులు కూడా మెచ్చుకుంటున్నారు. ఇలాంటి బాధ్యతాయుతమైన చిత్రం తీసినందుకు మహేష్‌ని మెచ్చుకోవాల్సిందే. కానీ కలెక్షన్లు మాత్రం సునామీ సృష్టించేలా లేవన్నది వాస్తవం. ముఖ్యంగా ఓవర్‌సీస్, సీడెడ్‌లో ఈ మూవీకి పెద్దగా కలెక్షన్లు లభించడం లేదు. మరోవైపు మహేష్ మాత్రం ఇది తన 25వ ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో బాగా ఎగ్జైట్ అవుతున్నాడు. డెహ్రాడూన్‌లో ఈ చిత్రం షెడ్యూల్ జరిగినప్పుడు ఈమూవీ ‘పోకిరి’కి స్క్వైర్ అవుతుందని తాను చెప్పానని మహేష్ అంటున్నాడు.
కానీ పోకిరిలో ఎలాంటి మెసేజ్ లేకపోయినా ఈ చిత్రం సాధించిన విజయం చిన్నా చితకా కాదు. పోకిరి నాడు ధియేటర్ల టిక్కెట్ల ధర మహర్షితో పోలిస్తే సగం కూడా లేవు. కలెక్షన్లపరంగా నేటి పరిస్థితుల్లో పోకిరిని, మహర్షి దాటి ఉండవచ్చు. కానీ నాడు పోకిరికి వచ్చినట్లుగా యునానిమస్ బ్లాక్‌బస్టర్ టాక్ నేడు మహర్షికి రాలేదన్నది నిజం. నిజంగా మహేష్ మాటలు నిజం కావాలంటే మహర్షి చిత్రం కనీసం 50రోజులు ఎలాంటి డెఫిషిట్ లేకుండా ఆకట్టుకోవాల్సివుంటుంది. ఈ విషయంలో ట్రేడ్ పండితులు దీనిని అసాధ్యంగా కొట్టి పారేస్తున్నారు.
ఇక మహర్షి తన అభిమానులే కాదు.. తాను కూడా కాలర్ ఎగురవేసే చిత్రమని సినిమా విడుదలైన తర్వాత ఓసారి, హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డు థియేటర్‌లో చూసిన ఓసారి మహేష్ కాలర్ ఎగురవేశాడు. కానీ విజయవాడ వేడుకలో మాత్రం ఆయన కాలర్ ఎగురవేయలేదు. ఇక ఇంతకు ముందు తన 25వ చిత్రం మహర్షి కాబట్టి తాను పనిచేసిన దర్శకులందరి గురించి మాట్లాడిన మహేష్ పూరీ, సుక్కుల పేర్లను చెప్పడం మాత్రం మర్చిపోయి ఆ తర్వాత ఆ తప్పును సరిదిద్దుకున్నాడు. ఈసారి మాత్రం మహేష్ తన మొదటి చిత్రం దర్శకుడు రాఘవేంద్రరావుని తప్ప మరెవ్వరి పేరును ఎత్తకుండా జాగ్రత్త వహించడం గమనార్హం.
By May 21, 2019 at 05:07AM
No comments