Breaking News

మళ్లీ లిఫ్టిచ్చాడు.. హిట్టు లోకంలోకి వచ్చేనా?


తెలుగులోకి డైరెక్టర్‌ అవుదామని వచ్చి హీరోలు అయిన వారిలో నేటితరంలో రవితేజ, నాని, రాజ్‌తరుణ్‌లను చెప్పుకోవాలి. ఇక రాజ్‌తరుణ్‌ విషయానికి వస్తే ఆయన మొదటి చిత్రమే ఉయ్యాల జంపాల పెద్ద హిట్‌ అయింది. ఆ తర్వాత సినిమా చూపిస్త మావా, కుమారి21ఎఫ్‌, ఈడోరకం ఆడోరకం చిత్రాలు బాగానే ఆడాయి. కానీ ఆ తర్వాతే అతని కథ డామిట్‌ అడ్డం తిరిగింది. సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు, నాన్న నేను నా బోయ్‌ప్రెండ్‌, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు, బెలూన్‌, రంగుల రాట్నం, రాజుగాడు వంటి చిత్రాలు బాగా ఆడలేదు. 

ముఖ్యంగా నాగార్జున నిర్మించిన రంగుల రాట్నం, దిల్‌రాజ్‌ బేనర్‌లో వచ్చిన లవర్‌ చిత్రాలు కూడా తీవ్రంగా నిరాశపరిచాయి. కాగా రాజు గారు మెచ్చిన ఈ హీరో మరో సారి తంతే గారెల బుట్టెలో పడ్డాడు. రాజుగారి నిర్మాణంలో జీఆర్‌కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. టైటిల్‌ ‘ఇద్దరి లోకం ఒకటే’. మిక్కీజెమేయర్‌ సంగీతం అందిస్తున్నాడు. రొమాంటిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ జోనర్‌లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం లొగో పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. 

పింక్‌ కలర్‌ పెయింటింగ్‌ నేపధ్యంలో ఉండగా, ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే టైటిల్‌ బ్లాక్‌ఫాంట్‌తో ఉంది. ‘లోకం’ పదానికి చుట్టూ వైట్‌ కలర్‌ హార్ట్‌సింబల్‌ ఉంది. ఈ చిత్రానికి క్యాప్షన్‌ ‘యు ఆర్‌ మై హార్ట్‌ బీట్‌’. కిందటి ఏడాదే తనతో లవర్‌ చిత్రం తీసి బాగా దెబ్బతిన్న దిల్‌రాజుకి ఇద్దరి లోకం ఒకటే ద్వారా అయినా నిర్మాతలకు లాభాలు తెచ్చి, చాలా కాలం తర్వాత తన కెరీర్‌లో ఓహిట్‌ని వేసుకోవాలని రాజ్‌తరుణ్‌ సన్నిహితులు ఆశిస్తున్నారు. 



By April 24, 2019 at 04:16PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45663/raj-tarun.html

No comments