Breaking News

‘జెర్సీ’ కోసం మరో క్యూ పెరుగుతోంది!


ఒకప్పుడు తెలుగులో మూస చిత్రాలు వచ్చేవి. దాంతో మన నిర్మాతలు తమిళంలో ఏదైనా హిట్‌ చిత్రం వస్తే చెన్నై ఫ్లైట్‌ ఎక్కి, రీమేక్‌గానో, డబ్బింగ్‌గానో ఆ చిత్రం హక్కులు పొందేందుకు క్యూలో నిలబడేవారు. ఇక బాలీవుడ్‌ చిత్రాల విడుదల సమయంలో కూడా మన మేకర్స్‌ వాటిని ఎంతో శ్రద్దగా ఫాలో అయ్యేవారు. చివరకు మలయాళ, కన్నడ వంటి చిత్రాల కోసం కూడా మన నిర్మాతలు పోటీ పడుతుంటే ఆ భావదారిద్య్రం చూసి పలువురు బాధ పడేవారు. కానీ అన్నిరోజులు ఒకేలా ఉండవు. ఓడలు బండ్లు అవుతుంటాయి... బండ్లు ఓడలు అవుతుంటాయి. ఇప్పటికీ మన నిర్మాతలు ‘యూటర్న్‌, కిర్రాక్‌పార్టీ, కణితన్‌’ వంటి వాటి వెంట పడుతున్నా కూడా ఆ ముందు కాలం నాటి జోరు లేదు. అదే సమయంలో తెలుగులో విడుదలయ్యే చిత్రాల కోసం ఇతర భాషా నిర్మాతలు క్యూ కట్టాల్సిన వైభవం తెలుగుకి వచ్చింది. 

‘అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్‌ 100, మహానటి, రంగస్థలం, గూఢచారి, ట్యాక్సీవాలా’ వంటి చిత్రాలు ఇతర భాషల నిర్మాతలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు నేచురల్‌స్టార్‌ నాని హీరోగా నటించగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ వంతు వచ్చింది. ఇక ‘మజిలీ’ చిత్రం కోసం కూడా మరీ ‘జెర్సీ’ రేంజ్‌లో కాకపోయినా పరభాషా నిర్మాతలు వచ్చి వాలుతున్నారు. నిజానికి ‘జెర్సీ’ని టాలీవుడ్‌ ‘లగాన్‌’ అని పోల్చవచ్చు. క్రికెట్‌ నేపధ్యం మాత్రమే ఒకటి గానీ ఇతర విషయాలలో స్టార్‌డమ్‌ ఉన్న హీరోల నుంచి దేశభక్తి కాన్సెప్ట్‌ వరకు ఈ రెంటికి పోలిక లేదు. కానీ ‘జెర్సీ’లో ఎమోషన్స్‌ మాత్రం ‘లగాన్‌’ రేంజ్‌లోనే ఉన్నాయి. ‘జెర్సీ’లోని ఎమోషన్స్‌కి కన్నీరు పెడుతూ ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ఇంతగొప్పగా ఈ చిత్రానికి మౌత్‌టాక్‌, సోషల్‌మీడియా, మీడియా, వెబ్‌సైట్స్‌ నుంచి రివ్యూలు... ఇలా ఇంత పాజిటివ్‌టాక్‌ ఈమద్య కాలంలో ఏ తెలుగు చిత్రానికి రాలేదని విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు. 

ఇప్పుడు ‘జెర్సీ’ రీమేక్‌ కోసం పోటీ కూడా అంతే కష్టంగా ఉందని తెలుస్తోంది. ఈ చిత్రం జోరు కాస్త తగ్గిన తర్వాత ఈ మూవీని చూసి బాలీవుడ్‌లోకి రీమేక్‌ చేయాలా? వద్దా? అనేది నిర్ణయించుకోవాలని కరణ్‌జోహార్‌ భావిస్తున్నాడట. ఇదే సమయంలో ‘జెర్సీ’ రీమేక్‌తోనే తాను బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఎందుకు ఇవ్వకూడదు? అనే ఆలోచనలో దిల్‌రాజు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తమిళ నుంచి లైకా సంస్థ, కన్నడ నుంచి రాజ్‌కుమార్‌ తనయులు పోటీలో ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి ‘జెర్సీ’ చిత్రం తెలుగు స్థాయిని మరింతగా పెంచిందనే చెప్పాలి. 



By April 25, 2019 at 08:00AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45668/jersey.html

No comments