Breaking News

కేసీఆర్‌ దెబ్బకు ‘దెయ్యం’ దిగింది!


బలహీనుడిపైనే ప్రతి ఒక్కడు జులం చేస్తాడు. అదే ప్రత్యర్ధి బలవంతుడు అయితే వారి జోలికి పోరు. ఉదాహరణకు ఇండియా ఆర్ధికంగా చితికి పోయి నానా ఇబ్బందులు పడుతున్న పాకిస్థాన్‌పై యుద్దానికి సై అంటుందే గానీ చైనా మనల్ని ఎంతగా వేధించినా కూడా దానిని పట్టించుకోనట్లు ఉంటుంది. నేటి రోజులలో తత్వం ఇదే. మీడియా కూడా సౌమ్యులపైన చూపిన ప్రతాపం బలవంతుల మీద చూపించదు. ఇక విషయానికి వస్తే రాజకీయాలలో చంద్రబాబు సీనియరే కావచ్చు. కానీ ఆయనది కక్ష్యతీర్చుకునే మనస్తత్వం కాదు. తన పనిలో తాను ఉంటాడు. తెలివిగా ప్రవర్తిస్తాడే గానీ కక్ష్యసాధింపు చర్యలు చేయడు. కాబట్టే వర్మ వంటి వారు చంద్రబాబునాయుడుని విలన్‌గా చూపిస్తూ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ అనే చిత్రాన్ని తీశారు. అదే కేసీఆర్‌ విషయానికి వస్తే ఆయనది చంద్రబాబు కంటే డిఫరెంట్‌ మనస్తత్వం, టిట్‌ ఫర్‌టాట్‌ అన్నట్లు మనసులోనే పెట్టుకుని నొక్కాల్సిన సమయంలో నొక్కుతాడు. దీనిని నిరంకుశ పాలన అనండి, హిట్లర్‌ని మించిన వాడు అనండి.. ఏమైనా అనండి.. ఆయన మాత్రం విమర్శలను కూడా లెక్కచేయడు. 

తమిళనాట దివంగత అమ్మ జయలలిత తర్వాత ప్రత్యర్ధులపై, తనని విమర్శించిన వారిపై కూడా కక్ష్య తీర్చుకోవడంలో కేసీఆర్‌ ముందుంటాడు. ఈ విషయం ఆస్తులు, స్టూడియోలు, పరిశ్రమ హైదరాబాద్‌లోనే ఉన్న మన సినీ ప్రముఖులకు బాగా తెలుసు. ఏమైనా తేడా వస్తే డ్రగ్స్‌ కేసును తిరగతోడుతాడు. ఏదైనా చేస్తాడు. ఇలాగే ఆయన నాగార్జున వంటి వారిని కూడా తన దారికి తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు వర్మ వంతు వచ్చింది. తాను తీసే చిత్రాలలో కాంఫ్లిట్‌ ఉండాలని, వివాదాలకు, ఎవ్వరికీ తెలియని కోణాలను చూపించి, నెగటివిటీని ఎండగట్టడమే తన స్టైల్‌ అని ఆయన పలుసార్లు చెప్పాడు. ఇప్పుడు అదే నిజం చేశాడు. ఆయన త్వరలో కేసీఆర్‌ మీద బయోపిక్‌ తీస్తున్నాడు. దీనికి ఆయన ‘టైగర్‌ కేసీఆర్‌’(ది అగ్రెసివ్‌ గాంధీ) అనే టైటిల్‌ని పెట్టాడు. ఇందులో కేసీఆర్‌ మీద ఉన్న విమర్శలు, ప్రత్యర్ధులు ఆయన గురించి చెప్పే రహస్యాలను కాకుండా కేసీఆర్‌ని ఆకాశానికి ఎత్తనున్నాడని టైటిల్‌, క్యాప్షన్‌ని బట్టి చూస్తేనే అర్ధమవుతోంది. 

ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో ‘ఆడు తెలంగాణ తెస్తానంటే అందరు నవ్విండ్రు’ అనే ఒక కొటేషన్‌ ఇచ్చాడు. ఇక కేసీఆర్‌ని ‘ఆడు’ అని వాడటంపై అప్పుడేదుమారం చెలరేగింది. దీనిపై కొందరు కేసీఆర్‌ మనషులు మండిపడుతున్నారు. తాజాగా వర్మ ‘ఆడు’ అనే పదంపై వివరణ ఇచ్చాడు. ఎవ్వరికీ ఎప్పుడు వివరణ ఇవ్వనని చెప్పే వర్మ ఈసారి మెట్టుదిగాడు. ట్యాగ్‌లైన్‌లో ‘ఆడు’ అని నేను వాడిన పదానికి కారణం ఒక్కటే. తెలంగాణ సాధించకముందు కేసీఆర్‌ని చూసిన కొందరి దృష్టిలో ఆ పదం వాడటం జరిగిందని వివరణ ఇచ్చాడు. ఆ పదంలో ఎంత డెప్ట్‌ ఉందో కేసీఆర్‌, కేటీఆర్‌లు బాగా అర్ధం చేసుకుంటారనే ఆశాభావాన్ని వర్మ వెలిబుచ్చాడు. దీనిపై నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. 

‘ఏంటిది. కొత్తగా సంజాయిషీ ఇస్తున్నావు. బొత్తిగా మారిపోయావు వర్మా’ అని ఒకరు వ్యాఖ్యానిస్తే, మరో నెటిజన్‌ ‘నేను ఆ డెప్త్‌ అర్ధం చేసుకున్నాను. ఆడు అనే పదం తప్పుకాదు. ఆడు అనేది అగౌరవమైన పదం ఏమీ కాదు. ఆ పదం మాస్‌ పీపుల్‌ మాత్రమే అర్ధం చేసుకుంటారు. ఆడుగొప్పొడురా అని అంటాం కదా... ఇదీ అంతే’ అని తెలిపాడు. మరోకరు.. కేసీఆర్‌తో జాగ్రత్త .. తక్కువ చేసి చూపితే కేసీఆర్‌ తాట తీస్తాడు.. అని హెచ్చరించాడు. మొత్తానికి ఈదేశంలో మోదీ, కేసీఆర్‌ వంటి నియంతలను మాత్రం ప్రశ్నించే గొంతులు లేవని వర్మ మరోసారి రుజువు చేశాడనే చెప్పాలి.



By April 20, 2019 at 11:01AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45603/kcr-biopic.html

No comments