Breaking News

ఇతనెవరో మురుగదాస్‌ అబ్బలా ఉన్నాడు!


నిజానికి సినిమా రంగంలోని టెక్నీషియన్స్‌లోనే ప్రతిభ ఉంటుందని, వారిలో ఉన్న ఆ ప్రతిభ వల్లే వారు స్టార్స్‌ చిత్రాలను తీస్తూ ఉంటారనే భ్రమ ఉంది. కానీ నేటి రోజుల్లో హీరోల అభిమానులు, ప్రేక్షకులు, నెటిజన్లు కూడా తమ సృజనాత్మక విషయంలో అంచులు దాటేస్తూ అసలు కంటే కొసరే బాగుందనే టాక్‌ని స్ప్రెడ్‌ చేస్తున్నారు. నిజానికి నేడు కొందరు స్టార్స్‌ చేస్తున్న కథల కంటే తమ హీరోల కోసం అభిమానులు రాసి పెట్టుకునే కథలలోనే కొన్ని అద్భుతాలు ఉన్నాయనేది వాస్తవం. టైటిల్‌ని ప్రకటించిన వెంటనే కథను అల్లేయడం, పోస్టర్‌ని, టైటిల్‌ని చూసి మిగిలిన వాటిని చెప్పేయగలగడం చేస్తున్నారు. కొన్ని సార్లు అలా నెటిజన్లు ఊహించినవే నిజం అవుతుంటే మరికొన్ని ఆ చిత్రాలు విడుదలై చూసిన తర్వాత అసలు సినిమా కంటే ప్రేక్షకులు వండి వార్చిన కథలే బాగున్నాయనే టాక్‌లు వినిపిస్తూ ఉంటాయి. నిజానికి మన ప్రేక్షకుల సృజనాత్మకతను ఉపయోగించుకోవాలే గానీ వారు అద్భుతాలు చేయగలరు. 

ఇక విషయానికి వస్తే తాజాగా రజనీ, మురుగదాస్‌ దర్శకత్వంలో ‘దర్బార్‌’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం టైటిల్‌ పోస్టర్‌ని విడుదల చేసినప్పుడు ఓ విదేశీ చిత్రం పోస్టర్‌ని యాజిటీజగా కాపీ కొట్టారని విమర్శలు వచ్చాయి. కేవలం కాపీ పేస్ట్‌లు చేయడంపై విమర్శల పరంపర సాగింది. ప్రస్తుతం ఈ చిత్రం నుంచి కొన్ని లీక్‌డ్‌ ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఇందులోంచి విషయం తీసుకుని ఓ నెటిజన్‌ రజనీ పోలీస్‌ దుస్తుల్లో తనదైన స్టైల్‌లో కళ్లద్దాలు పెట్టుకుంటూ తనదైన యాటిట్యూడ్‌ చూపుతూ తయారు చేసిన ‘దర్బార్‌’ పోస్టర్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. ఈ పోస్టర్‌ చూసిన ఎవరైనా మురుగదాస్‌ టీం తయారు చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ కంటే ఈ అభిమాని తయారు చేసిన పోస్టరే అద్భుతమని చెప్పకుండా ఉండలేరు. 

రజనీ చిత్రం అంటే అందరు ఏది ఆశిస్తారో వాటినే ఆ డిజైనర్‌ తన పోస్టర్‌లో పొందుపరిచాడు. దీనిని బట్టి ఈ నెటిజన్‌ సృజనాత్మకత అర్ధం అవుతోంది. కాస్త మురుగదాస్‌ అండ్‌ టీం ఈ చిత్రం విషయంలో ఇలాంటి ఔత్సాహికుల సహాయాన్ని తీసుకుంటే బాగుంటుందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఇక రజనీ చిత్రం అంటే గతంలోలాగా తెలుగులో క్రేజ్‌ లేదు గానీ ‘పేట’తో తమిళంలో రజనీని కొట్టేవారు మరొకరు లేరని నిరూపణ అయింది. ఇక ‘దర్బార్‌’ చిత్రంతో రజనీ మేనియా మరలా తెలుగులో కూడా ప్రారంభం అవుతుందేమో వేచిచూడాల్సివుంది. ఈ చిత్రం 2020 పొంగల్‌ కానుకగా భారీ పోటీకి సిద్దమవుతోంది. 



By April 26, 2019 at 05:42AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45679/rajinikanth.html

No comments