Breaking News

మహిళకు 33శాతం సీట్లు ఏమయ్యాయి?


మహిళలు సృష్టిలో సగమని చెబుతాం. వారు మగాళ్లకు ఏ విషయంలోనూ తక్కువ కాదు. ప్రతి విషయంలోనూ మగాళ్లకు అన్ని విధాలుగా పోటీ ఇస్తున్నారు. కానీ అదేమి పాపమో తెలియదు గానీ మహిళలకు అన్ని రంగాలలో కంటే రాజకీయ రంగంలో మాత్రం సరైన గుర్తింపు ఉండటం లేదు. పేరుకు మహిళలకు సీట్లు ఇచ్చినా వారిని వెనుక ఉండి నడిపించేది మాత్రం భర్త, సోదరుడు, కుమారులు.. వీరే. కాబట్టి మహిళా రాజకీయ రిజర్వేషన్లు ఏమాత్రం సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ఇక పార్టీలన్నీ తమకు అక్కలు, చెల్లెలు, అమ్మల మీదనే నమ్మకం ఎక్కువ అని చెబుతుంటాయి. మహిళలకు తాము ఇచ్చిన ప్రాధాన్యం మరెవ్వరు ఇవ్వడం లేదని గొంతు చించుకుంటూ ఉంటాయి. 

మరి దేశవ్యాప్తంగా ఏ పార్టీలు మహిళకు మగాళ్లతో సరిసమానమైన ప్రాతినిధ్యం ఇచ్చాయనే లెక్క తీసుకుంటే అన్ని పార్టీలు యధా రాజా తథా ప్రజా అన్నట్లే ఉంటున్నాయి. నిజానికి మగాళ్లకంటే ఓట్ల విషయంలో మహిళలే నిజాయితీగా ఉంటారు. తమకి మేలు చేసిన వారికి ఓట్లు వేస్తారే గానీ కేవలం డబ్బు, మద్యం, బిరియాని ప్యాకెట్లను చూసి వారు ప్రలోభ పడరు. ఆ విధంగా చూసుకుంటే మహిళల్లో ఏ పార్టీకి మద్దతు ఉంటే వారిదే విజయం అనేది అక్షరసత్యం. మహిళలు మొగ్గు చూపిన పార్టీలే విజయదుంధుబి మోగించడం ఖాయం. అయితే మహిళలకు కనీసం 33శాతం సీట్లు ఏ పార్టీ కూడా ఎందుకు పట్టించుకోలేదు అనే విషయాన్ని మహిళా ఓటర్లు నిశితంగా పరిశీలించడం ముఖ్యం. 

తమకి నిజంగా ఎవరు మేలు చేస్తున్నారు? అనే దానిపై వారు ఓ అవగాహనకు వచ్చే వీలుంది. ఎన్నికల మేనిఫెస్టోలు చూస్తే ప్రతి పార్టీ కూడా మహిళలకు రుణాలు, స్మార్ట్‌ఫోన్లు, వితంతు పింఛన్లు, వడ్డీ లేని రుణాలు వంటివి భారీగా ప్రకటించాయి. గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని, రేషన్‌కి బదులు ప్రతి మహిళ ఖాతాలో రెండు నుంచి మూడు వేలు వేస్తామని, మహిళల పేర్లు మీదనే ఇళ్లను ఇస్తామని చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మహిళలు ఏ పార్టీకి మద్దతు ఇవ్వనున్నారనే ఆసక్తి అందరిలో మొదలైంది. కానీ ఈ విషయంలో మహిళా ఓటర్లు మాత్రం గుంభనంగా ఉంటున్నారు. ఎవరు అడిగినా మా ఓటు మీకే అని అంటున్నారు. మొత్తానికి తటస్థ ఓటర్లు, మహిళలు ఏ పార్టీని నమ్మితే వారిదే విజయమనేది ఖాయం. 



By March 27, 2019 at 10:37AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45309/ap-elections.html

No comments