Breaking News

మహారాష్ట్రలో ఒమిక్రాన్ కలకలం.. మూడేళ్ల పాప సహా కొత్తగా ఏడుగురికి నిర్ధారణ!


దేశంలో కొత్తరకం వేరియంట్ చాపకింద నీరులా వ్యాప్తిచెందుతోంది. మూడు రోజుల పాటు ఎటువంటి కేసులు బయటపడకపోగా.. శుక్రవారం ఏకంగా 9 మందికి కొత్తగా ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. మహారాష్ట్రలో ‘ఒమిక్రాన్‌’ కలకలం సృష్టిస్తోంది. శుక్రవారం అక్కడ మరో ఏడు కేసులు నమోదయ్యాయి. ఇందులో మూడున్నరేళ్ల చిన్నారి కూడా ఉంది. గుజరాత్‌లో మరో ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 32కు చేరుకుంది. ‘‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో కొత్తగా ఏడు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ముంబయిలో మూడు, పింప్రీ-చించ్వాడ పరిధిలో నాలుగు కేసులు ఉన్నాయి’’ అని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ముంబయికి చెందిన ముగ్గురు బాధితులు పురుషులేనని, వీరు టాంజానియా, యూకే, దక్షిణాప్రికా నుంచి వచ్చారని అధికారులు చెప్పారు. టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తి ధారావికి చెందినవాడని తెలిపారు. పింప్రీ- చించ్వాడలో ఒమిక్రాన్‌ సోకిన నలుగురిలో ముగ్గురు భారత సంతతికి చెందిన నైజీరియా మహిళలు ఉన్నారు. ఒమిక్రాన్ సోకిన ఏడుగురులో నలుగురు పూర్తిస్తాయి టీకా తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలో అత్యధికంగా ఒమిక్రాన్‌ కేసులు మహారాష్ట్ర (17)లోనే నమోదుకావడం గమనార్హం. తర్వాత రాజస్థాన్‌ (9) గుజరాత్‌ (3), కర్ణాటక (2), ఢిల్లీ (1) ఉన్నాయి. గతవారం నైజీరియా నుంచి వచ్చిన పింప్రీ- చించ్వాడ్‌కు చెందిన నలుగురు, వారితో కాంటాక్ట్ అయిన ముగ్గురికి ఒమిక్రాన్ సోకిన విషయం తెలిసిందే. తాజాగా, వీరితో కాంటాక్ట్ అయిన మరో నలుగురు ఈ వేరియంట్ బారినపడ్డారు. జింబాబ్వే నుంచి వచ్చిన గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకగా.. శుక్రవారం ఆయన భార్య, బావమరిదికి కూడా వేరియంట్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. కాగా, ఒమిక్రాన్ వేరియంట్‌ సోకిన వారిలో లక్షణాలు అంత తీవ్రంగా లేవని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ‘‘అందరిలోనూ స్వల్ప లక్షణాలే ఉన్నాయి.. మొత్తం కొవిడ్‌ కేసుల్లో ఈ కొత్త వేరియంట్‌ శాతం 0.04 కంటే తక్కువే’’ అని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. దేశంలో రెండో దశ వ్యాప్తికి కారణమైన డెల్టా వేరియంట్ తీవ్రత కొనసాగుతోందని, కరోనా క్లస్టర్స్‌గా మారిన చోట్ల కూడా ఈ వేరియంట్ కేసులే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.


By December 11, 2021 at 06:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-records-9-new-cases-total-omicron-tally-jumps-to-32/articleshow/88216695.cms

No comments