Breaking News

మహేష్ ఫ్యాన్స్‌కి మాములు న్యూస్ కాదిది!


సూపర్‌స్టార్ మహేష్ బాబు మేడం టుస్సాడ్స్ సింగపూర్ ఆధ్వర్యంలో తొలి, ఏకైక మైనపు బొమ్మని మార్చ్ 25‌న హైదరాబాద్‌లో ఆవిష్కరించనున్నారు. మేడం టుస్సాడ్స్ సింగపూర్ వారు ఒక ప్రముఖుని ప్రతిమని సింగపూర్‌లో కాకుండా బయట ఆవిష్కరించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా అభిమానులు ముమ్మూర్తులా తమ అభిమాన హీరోని పోలివుండే ప్రతిమతో సెల్ఫీలు, ఫోటోలు పంచుకునే అవకాశం లభిస్తోంది. తర్వాత మహేష్ మైనపు ప్రతిమ మేడం టుస్సాడ్స్ సింగపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగే ఐఫా ఉత్సవాల్లో భాగం కానుంది.

తెలుగు సినిమాలో అత్యంత విజయవంతమైన నటులు, హీరోల్లో ఒకరైన మహేష్ ఎన్నో అద్భుత విజయాలు సాధించారు. 250 సంవత్సరాల చరిత్ర కలిగిన ‘మేడం టుస్సాడ్స్’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ 23 శాఖల్లో అంతర్జాతీయ ప్రముఖుల మైనపు ప్రతిమలు  తయారు చేసి ప్రపంచం నలుమూలల నుండి వచ్చే సందర్శకులకు వారి అభిమాన ప్రముఖుల్ని కలిసే అనుభూతిని ఇస్తోంది.

మేడం టుస్సాడ్స్ సింగపూర్ వారు తన ప్రతిమని ఆవిష్కరిస్తున్న సందర్భంగా సూపర్ స్టార్ మహేష్.. ‘‘ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ ఈ గౌరవానికి చాలా సంతోషంగా ఉంది. ప్రతిమ తయారు చేయడానికి కావాల్సిన కొలతలు, ఇతర వివరాలు తీసుకోవడానికి నాలుగు గంటలు పట్టింది. అభిమానుల లాగానే, నేను కూడా మేడం టుస్సాడ్స్ వారి నా మైనపు బొమ్మని చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.

ప్రతిమలు తయారు చేయడంలో సిద్ధహస్తులైన మేడం టుస్సాడ్స్ వారి నిపుణుల బృందం హైదరాబాద్ వచ్చి మహేష్ బాబుని కలిసి 200కి పైగా కొలతల్ని, అన్ని వివరాలని సేకరించారు. అచ్చం మహేష్‌ని పోలి ఉండేలా బొమ్మని తయారు చేయడానికి జుట్టు, కళ్ళ రంగు వంటి విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకున్నారు.

మేడం టుస్సాడ్స్ సింగపూర్ జనరల్ మేనేజర్ అలెక్స్ వార్డ్ మాట్లాడుతూ.. ‘‘మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ ప్రతిమని తయారు చేయడం మాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాం. భారతదేశం నలుమూలల నుండి టూరిస్టులు మా శాఖని సందర్శిస్తుంటారు. భారతీయ సినీ ప్రముఖుల్ని వారికి అందుబాటులో ఉంచడమే మా లక్ష్యం’’ అన్నారు.



By February 23, 2019 at 05:59AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44837/mahesh-babu.html

No comments