Breaking News

అల్ల‌రోడికి థ్రిల్ల‌రైనా క‌లిసొస్తుందా?


రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌రువాత ఆ త‌ర‌హాలో వినోదాన్ని పండించ‌డానికి అల్ల‌రోడు అల్ల‌రి న‌రేష్‌ ప్ర‌య‌త్నాలు చేశాడు. కొన్ని పేలాయి. కొన్ని పేల‌లేదు. అయినా గ‌త కొన్నేళ్ల పాటు అత‌ని కెరీర్ న‌ల్లేరు మీద న‌డ‌క‌లాగే సాగింది. పేర‌డీల కామెడీలు, జ‌బ‌ర్ద‌స్త్ స్కిట్‌లు రావ‌డంతో అల్ల‌రోడికి ప‌నిలేకుండా పోయింది. ఫ‌లితంగా మినిమ‌మ్ గ్యారెంటీ హీరోగా క్ష‌ణం తీరిక‌లేకుండా ఓ వెలుగు వెలిగిన అల్ల‌రి న‌రేష్ కెరీర్ ప్ర‌స్తుతం డేంజ‌ర్‌లో ప‌డింది. ఇటీవ‌ల త‌ను హీరోగా న‌టించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వ‌ద్ద నిల‌బ‌డ‌లేక‌పోయాయి. 

దీంతో అల్ల‌రి న‌రేష్‌తో సినిమా చేయ‌డానికి నిర్మాత‌లు జంకుతున్నారు. `సుడిగాడు` సినిమా త‌రువాత త‌ను న‌టించిన సినిమా ఏదీ ఆడ‌లేదంటే న‌రేష్ ప‌రిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఆ త‌రువాత చేసిన దాదాపు 14 చిత్రాల్లో కొన్ని ప‌ర‌వాలేదు అనిపించినా మ‌రికొన్ని మాత్రం ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌క‌పోగా న‌రేష్ కెరీర్ ఇక అయిపోయిన‌ట్టేనా అనే సంకేతాల్ని అందించాయి. దాంతో ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డ న‌రేష్ కొత్త ప్ర‌యాణాన్ని మొద‌లుపెడ‌దాం అని మ‌హేష్ న‌టిస్తున్న `మ‌హ‌ర్షి` సినిమాలో అత‌ని స్నేహితుడి వేశం ఒప్పుకున్నాడు. ఈ సినిమా ఫ‌లితంపైనే న‌రేష్ సెకండ్ ఇన్నింగ్స్ ఆధార‌ప‌డి వుంది. 

ఇదిలా వుంటే మ‌ళ్లీ హీరోగా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌నుకుంటున్నాడు. త‌న‌కు హిట్టిచ్చిన ఇ. స‌త్తిబాబు ద‌ర్శ‌క‌త్వంలో  ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సారి కామెడీని కాకుండా థ్రిల్ల‌ర్ అంశాల‌ను న‌రేష్ న‌మ్ముకుంటున్నాడ‌ని తెలిసింది. థ్రిల్ల‌ర్ క‌థ‌కు కామెడీని జోడించి స‌త్తిబాబు ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురాబోతున్నార‌ట‌. `మ‌హ‌ర్షి` చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన వెంట‌నే తాజా చిత్రాన్ని మొద‌లుపెట్టే ఆలోచ‌న‌లో అల్లరోడు వున్న‌ట్లు తెలిసింది. మ‌రి ఈ సారి అల్ల‌రోడికి థ్రిల్ల‌రైనా క‌లిసొస్తుందేమో చూడాలి. 



By February 21, 2019 at 03:23PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44816/allari-naresh.html

No comments