బయోపిక్‌లతో బజారుకీడుస్తున్నారు: తమ్మారెడ్డి
ప్రస్తుతం టాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ‘మహానటి, కథానాయకుడు, మహానాయకుడు, యాత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఇలా వరుస బయోపిక్‌లు రూపొందుతున్నాయి. దీనిపై సినీ పెద్ద తమ్మారెడ్డి భరద్వాజ సంచలన కామెంట్స్ చేశాడు. ఇటీవల కాలంలో వరుసగా పెద్దవారిపై వస్తున్న బయోపిక్స్ వారి జీవితాలను రోడ్డుపైకి ఈడ్చే విధంగా ఉంటున్నాయి. వాటిని మనం అసలు బయోపిక్స్ అనలేం. ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. ఫస్ట్‌హాఫ్ బాగానే ఉంది కానీ సెకండాఫ్ అంతా గతంలో ఎన్టీఆర్ చేసిన సీన్స్‌ని రీషూట్ చేసినట్లుగా ఉన్నాయి.
ఇక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ బయోపిక్ విషయంలో ట్రైలర్‌తో హడావుడి చేస్తున్నారు. బయోపిక్‌ల పేరుతో ఎన్టీఆర్‌ని బజారు కీడుస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆయన్ని అభిమానించే వారికి తీవ్ర మనస్థాపం కలుగుతుంది. అభిమానులు బాధపడతారు. బయోపిక్‌ల సమయంలో ఎన్టీఆర్‌పై యూట్యూబ్‌లలో పలు రకాల కథనాలను చూపుతున్నారు. ఆయన నిజజీవిత విశేషాలు ఎవ్వరికీ తెలియవు. వాటిని ఎవరికిష్టం వచ్చినట్లుగా వారు చూపించే ప్రయత్నం సరికాదు.
ఇక ‘మహానాయకుడు, లక్ష్మీస్ ఎన్టీఆర్’లలో ఏముందో చూడాలి...! యాత్ర వైఎస్‌ఆర్ బయోపిక్ కాదు. ఆయన జీవితంలోని ఒక ఘట్టం. దానిని బాగా తీశారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు కళ్లల్లో కన్నీరు తెప్పించాయి. చివరలో వైఎస్ మరణం చూపించడం మాత్రం రాజకీయలబ్దికే అని అర్ధం అవుతోందన్నారు. అయినా బయోపిక్ అంటే వాస్తవాలకు ప్రతిరూపంగా ఉండాలి. ఎంత గొప్పవారైనా వారిలో కూడా చెడు, మంచి, మంచి నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు ఉంటాయి. అలా నాణెంలోని రెండు కోణాలను చూపించగలిగే దమ్ముంటేనే వాటిని ప్రేక్షకులు ఆచరిస్తారు. ఎవరి జీవితం ఏమిటి? అనే విషయంలో ప్రజలకు, ప్రేక్షకులకు స్పష్టమైన అవగాహన ఉంది. దానికి నిజాలను దాచి తీసిన ‘కథానాయకుడు’ డిజాస్టర్ కావడం, లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ మిలియన్లలో వ్యూస్‌ని రాబట్టుకోవడం అనేదే ఉదాహరణ.
ఇక ‘మహానాయకుడు’ కంటే ప్రేక్షకులు ఎక్కువగా వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కోసమే ఎక్కువగా ఎదురుచూస్తున్నారనేది వాస్తవం. నిజానికి హాలీవుడ్, బాలీవుడ్‌లలోని బయోపిక్స్‌లో ఆ వ్యక్తి బలహీనతలు ఏమిటి? వాటిని ఆయన ఎలా అదిగమించాడు? అనే విషయాలను బాగా చూపుతారు. ఎవరో అభిమానులు బాధపడతారని చరిత్రను విస్మరించడం వీలు కాదు. బయోపిక్ అంటే ఎంతటి కఠిన విషయాలైనా నిజాయితీతో చెప్పాలి. ఎన్టీఆర్ కేవలం నందమూరి వారి ఆస్థి కాదు. ఆయన దేశ నాయకుడు. ఎవరైనా సరే.. ప్రజాజీవితంలోకి రానంతవరకు మౌనంగా ఉంటాం. ఒక్కసారి ప్రజాజీవితంలోకి వస్తే ఇక వారికి వ్యక్తిగత జీవితం అంటూ ఏమీ ఉండదు. వారి గురించి నిజాలను బట్టబయలు చేస్తామని నాడు శ్రీశ్రీ చెప్పిన మాటలు ఇక్కడ వర్తిస్తాయనే చెప్పాలి.
By February 22, 2019 at 01:33PM
No comments