వర్మ మరో బాంబ్ పేల్చాడు...!
తెలుగు ప్రేక్షకులకే కాదు.. దేశవ్యాప్తంగా స్వర్గీయ ఎన్టీఆర్ సినీస్టార్‌గా, ముఖ్యమంత్రిగా, జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ వంటి వాటి ద్వారా పరిచయం. ఇక తెలుగులో ఆయన్ను దేవుడిలా కొలుస్తారు. ఇదే నమ్మకంతో అందరు ఎంతో ఆదరిస్తారని భావించి ఆయన సుపుత్రుడు నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీఆర్ బయోపిక్’ని భుజానికి ఎత్తుకున్నాడు. బాలయ్య-చంద్రబాబుల మధ్య ఉండే బంధుత్వం, సాన్నిహిత్యం తెలిసిన పలువురు ఇందులో ఎన్టీఆర్‌ని దేవుడిగా చూపిస్తారే గానీ ఆయన జీవితంలోని అసలు విషయాలను, గొప్ప, వివాదాస్పద అంశాలను, జీవితంలోని ఎత్తుపల్లాలను, జరిగిన వాస్తవాలను, బొమ్మాబొరుసు రెండింటిని చూపే అవకాశం లేదని సినిమా ప్రకటించిన వెంటనే ఓ నిర్ణయానికి వచ్చేశారు. దీనికితోడు ఎన్టీఆర్‌ని చిన్న మచ్చ కూడా లేని దేవుడిలా చూపించడం, సావిత్రి వంటి పాత్రలకు మాత్రం నెగటివ్ టచ్ ఇవ్వడం చూసి కేవలం ఓ సామాజిక వర్గం వారికి నచ్చేలా ఎన్టీఆర్‌ని పూర్తిగా దేవుడిని చేసే ప్రయత్నం చేశారనే టాక్ వినిపించింది.
ఇక సినిమా విడుదల సమయంలో నాగబాబు, నాదెండ్ల భాస్కర్‌రావు వంటి వారు చేసిన వ్యాఖ్యలు, వారు వెల్లడించిన విషయాలు కూడా సినిమాని పక్కదోవ పట్టించాయి. రాంగోపాల్‌వర్మ ఎన్టీఆర్ జీవితంలోని అతి ముఖ్యమైన దశ అయిన లక్ష్మీపార్వతి రెండో వివాహం తర్వాత జరిగిన వాస్తవాలను తప్పకుండా చూపిస్తానని, తనదే నిజమైన బయోపిక్ అని తెలపడంతో పూర్తిగా పాజిటివ్‌గా తీసిన ‘కథానాయకుడు’కి క్రేజ్ తగ్గడానికి కారణమైంది.
ఇక వర్మ విషయానికి వస్తే నాడు మరణించిన ఎన్టీఆర్.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌తో పుట్టబోతున్నారని చెప్పి ఆయన వర్ధంతి సందర్భంగా ఈ చిత్రంలోని ఎన్టీఆర్ పాత్రధారిపై ఓ వీడియోను విడుదల చేశాడు. ఇందులో నటించిన ఎన్టీఆర్ పాత్రధారి అచ్చు అలాగే ఉండటంతో ప్రేక్షకుల్లో ఆలోచన మొదలైంది. ఇక వర్మ బయోపిక్స్ తీయడం కంటే అందులో పాత్రధారులకు సరైన పోలికలుండే వారిని ఎంచుకోవడంలో సిద్దహస్తుడు. బాల్‌ఠాక్రే, అసద్, వీరప్పన్..ఇలా దీనికి ఎందరినో ఉదాహరణగా చెప్పవచ్చు.
మరోసారి ఎన్టీఆర్ పాత్రధారితో పాటు చంద్రబాబునాయుడుగా శ్రీతేజ్, లక్ష్మీపార్వతిగా కన్నడ నటి ‘వీరప్పన్’లో ముత్తులక్ష్మిగా నటించిన యజ్ఞాశెట్టి వంటి వారితో తన టేస్ట్ ఏమిటో మరోసారి నిరూపించాడు. మొత్తానికి ఈ చిత్రాన్ని వైసీపీ నాయకుడు రాకేష్‌రెడ్డి నిర్మిస్తుండటం వల్ల, ఇప్పటికే విడుదల చేసిన ‘వెన్నుపోటు, ఎందుకు’ వంటి పాటల ద్వారా ఈ చిత్రంపై రోజురోజుకి ఆసక్తి పెరిగిపోతూ ఉంది.
By January 20, 2019 at 05:40PM
No comments