Breaking News

ఏ ఎండకా గొడుగు పట్టే నిర్మాత ఈయనే!


మనషికి ప్రతి విషయంలోనూ ఓ స్థిరాభిప్రాయం ఉండాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా తాను నమ్మిన సిద్దాంతానికే కట్టుబడి ఉండాలి. అంతేగానీ క్షణానికో, సినిమాకో విధంగా ప్రవర్తించే వారిని మాత్రం ఊసరవిల్లులు అనే చెప్పాలి. ఇక మన నిర్మాత, దర్శకులు, హీరోల విషయానికి వస్తే వారికి ఇటీవల మీడియాలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు జీర్ణం కావడం లేదు. ఒకప్పుడు మీడియా చాలా పరిమితంగా ఉన్న రోజుల్లో ఫ్లాప్‌ అయిన చిత్రాలు కూడా శతదినోత్సవం జరుపుకున్నాయని, ఇన్నిసెంటర్లలో విడుదలైన ఏకైక చిత్రం తమదేనని, ఇష్టం వచ్చిన కలెక్షన్ల లెక్కలు ప్రకటించేవారు.

మీడియా కూడా నేడు తప్పుదారిలో పయనిస్తోందనేది నిజమే. కానీ ఎవరో ఒకరిద్దరు ఇలా చేసినంత మాత్రాన మీడియా అంతటిని అదే గాటన కట్టడం సరికాదు. ఇక సినిమా రివ్యూలు, రేటింగ్‌ల విషయంలో మన పరిశ్రమలోని 99శాతం మంది కంటగింపుగానే ఉన్నారు. ఎప్పుడు సమయం వస్తుందా? మీడియని ఏకి పారేద్దామా? అని కోటి కళ్లతో ఎదురుచూస్తుంటారు. సినిమా బాగాలేదని రివ్యూ ఇస్తే మండిపడే వీరే.. తమ చిత్రానికి మంచి రివ్యూలు, రేటింగ్స్‌ ఇస్తే మాత్రం ఫలానా పత్రిక ఇంత రేటింగ్‌ ఇచ్చింది.

ఫలానా వెబ్‌సైట్‌ ఇంతలా తమ చిత్రాన్ని పొగిడిందని చంకలు గుద్దుకుంటూ ఉంటారు. ఇక మరికొందరు మీడియా రివ్యూలను ప్రేక్షకులు పట్టించుకోరని సెలవిస్తూ ఉంటారు. అలాంటప్పుడు అసలు మీడియా రేటింగ్స్‌ని పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? మొదటి రోజే కాకుండా ఓ వారం పదిరోజుల తర్వాత రివ్యూలు ఇవ్వాలనే డిమాండ్‌ కూడా చేస్తుంటారు. ఇక విషయానికి వస్తే ఇలాంటి వారిలో అగ్రస్థానం దిల్‌రాజ్‌కే దక్కుతుంది. ఆయన డిజె రివ్యూలపై ఏ విధంగా విరుచుకుపడ్డాడో తెలిసిందే.

ఇక సునీల్‌తో తాను నిర్మించిన కృష్ణాష్టమి చిత్రానికి మీడియా రివ్యూలు ఇవ్వాల్సిన పనిలేదని, ఆ చిత్రానికి తానే రివ్యూ, రేటింగ్స్‌ఇచ్చుకున్నాడు. కానీ దాని ఫలితం తెలిసిందే. ఇక గత ఏడాది ఆయనకు లవర్‌, శ్రీనివాసకళ్యాణం, హలో గురు ప్రేమకోసమే చిత్రాలతో వరుస ఫ్లాప్‌లు వచ్చాయి. కానీ తాజాగా విడుదలైన ఎఫ్‌2 కి మీడియా మంచి రివ్యూలు, రేటింగ్స్‌ ఇచ్చి సంక్రాంతి విజేత ఈ చిత్రమే అని చెబుతోంది. దాంతో బాగా ఖుషీ అయిన దిల్‌రాజు మీడియా అద్భుతం, మాకెంతో సపోర్ట్‌ చేస్తోందని తన రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తున్నాడు. 



By January 15, 2019 at 12:11PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44294/dil-raju.html

No comments