శర్వానంద్.. వరస చూశారా..?
తెలుగులో విభిన్న చిత్రాల హీరోగా శర్వానంద్‌కి పేరుంది. కథలో, తన పాత్రల్లో ఎంతో వైవిధ్యం ఉంటేనే గానీ ఈయన గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడు. మొదట్లో ఆయన పలు చిత్రాలలో చిన్నచిన్న పాత్రలు చేశాడు. ‘యువసేన, గౌరీ, శంకర్‌దాదా ఎంబిబిఎస్, సంక్రాంతి, వెన్నెల, లక్ష్మీ’, వంటి చిత్రాలతో పాటు ‘అమ్మచెప్పింది, గమ్యం, అందరి బంధువయ్యా, ప్రస్థానం, రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్‌రాజా, శతమానం భవతి, మహానుబాహుడు’ వంటి గుర్తుండిపోయే చిత్రాలలో తన సత్తా చాటాడు.
తాజాగా ఆయన దిల్‌రాజు బేనర్‌లో సమంతకి జోడీగా తమిళ బ్లాక్‌బస్టర్ ‘96’కి ఓకే చెప్పాడు. తమిళంలో ఎంతో ఫీల్‌గుడ్ మూవీగా భారీ విజయం అందుకున్న ఈ చిత్రంతో శర్వానంద్ అగ్నిపరీక్షనే ఎదుర్కోనున్నాడు. వర్తమానంతో పాటు గడిచిపోయిన కాలంలో జరగనున్న ఈ చిత్రం ఒరిజినల్ వెర్షన్‌లో విజయ్ సేతుపతి, త్రిష అద్భుతంగా నటించారు. మరి దీని రీమేక్‌లో నటించడం అంటే ఖచ్చితంగా శర్వానంద్‌ని, విజయ్‌సేతుపతికి కంపేర్ చేస్తారు. ఏమాత్రం తేడా వచ్చినా విమర్శలు తప్పవు. ఇక త్రిష పాత్రను సమంత కూడా ఎలా చేస్తుందో వేచిచూడాలి! నిజానికి ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్, 96’ వంటి చిత్రాలలో ఫీల్ పోకుండా ఉండాలంటే వాటిని డబ్ చేయడం మేలు.
కానీ శర్వా, సమంతలపై నమ్మకంతో ఈ మూవీ రూపొందుతోంది. మరోవైపు ప్రస్తుతం శర్వా సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో కూడా ఆయన తన నటనకు కఠిన పరీక్షగా నిలిచే వయసు మళ్లిన డాన్ పాత్రను చేస్తున్నాడని తెలుస్తోంది. దీని తర్వాత ‘కార్తికయ, ప్రేమమ్’లతో హిట్స్ కొట్టి ‘సవ్యసాచి’తో దెబ్బతిన్న చందు మొండేటి దర్శకత్వంలో మరో చిత్రం ఓకే చేశాడని సమాచారం. మరి ఇలా వరుస వైవిధ్యభరితమైన పాత్రలు, కథలు ఎంచుకుంటున్న శర్వాకి వాటి ద్వారా ప్రేక్షకులను మెప్పించి, కమర్షియల్ హిట్స్ అందుకోవడం అగ్నిపరీక్షేనని చెప్పాలి.
By January 29, 2019 at 07:33AM
No comments