Breaking News

ఇది నేచురల్‌ స్టార్‌ స్టామినా..!


గంటా నవీన్‌బాబు అంటే ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు గానీ నేచురల్‌స్టార్‌ నాని అంటే ఎవరైనా ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా దర్శకుడు కావాలని ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా మారాడు నాని. ఇంద్రగంటి మోహనకృష్ణ ‘అష్టాచెమ్మా’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. చిరంజీవి, రవితేజ తర్వాత కేవలం టాలెంట్‌తోనే స్టార్‌ స్థాయికి చేరుకున్న వాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని చిత్రాలు బాగా ఆడకపోయినా ‘అలా మొదలైంది, పిల్లజమీందార్‌, భీమిలి కబడ్డీజట్టు’ వంటి చిత్రాల ద్వారా మెప్పించాడు. కానీ అదే సమయంలో ‘జెండాపై కపిరాజు, పైసా, ఆహా.. కళ్యాణం’ వంటి పలు చిత్రాలు ఫ్లాప్‌ కావడంతో ఆయన కెరీరే డోలాయమానంలో పడింది. 

ఇక ఈయన చేసింది చిన్నపాత్రే అయినా రాజమౌళి ‘ఈగ’ మంచి పేరు తెచ్చింది. ఎట్టకేలకు ఈయనకు స్టార్‌ స్టేటస్‌ని తెచ్చిన చిత్రం మాత్రం ‘భలే భలే మగాడివోయ్‌’ అని చెప్పాలి. ‘ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివోయ్‌, కృష్ణగాడి వీరప్రేమగాథ, జెంటిల్‌మేన్‌, మజ్ను, నేను లోకల్‌, నిన్నుకోరి, ఎంసీఏ’ వంటి వరుస చిత్రాలతో నేచురల్‌స్టార్‌గా దూసుకుపోయాడు. కేవలం 10కోట్లకి అటు ఇటుగా ఉన్న తన మార్కెట్‌ని ఇంతింతై వటుడింతై అంటూ పెంచుకుంటూ వారసులకు మాత్రమే పరిమితమైన 50కోట్ల క్లబ్‌లో చేరాడు. నానితో సినిమా అంటే సేఫ్‌ గేమ్‌గా, మినిమం గ్యారంటీగా నేడు నిర్మాతలు, బయ్యర్లు భావిస్తున్నారు. 

తాజాగా ఆయన చేసిన ‘కృష్ణార్జునయుద్దం, దేవదాసు’ చిత్రాలు పెద్దగా ఆయన కెరీర్‌కి ఉపయోగపడలేదు. దాంతో మరోసారి వినూత్నంగా రంజీ క్రికెట్‌ నేపధ్యంలో ‘జెర్సీ’ చిత్రంలో నటిస్తున్నాడు. వయసు మళ్లిన వయసులో క్రికెటర్‌గా ఎదగాలని భావించి కష్టపడి గోల్‌ని సాధించే 30ప్లస్‌ వయసు ఉన్న పాత్రలో నాని క్రికెటర్‌ పాత్రను పోషిస్తున్నాడని సమాచారం. గౌతమ్‌ తిమ్మనూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఇందులో శ్రద్దాశ్రీనాధ్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, తమిళ నెంబర్‌ వన్‌ సంగీత దర్శకుడు అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇదేమీ బయోపిక్‌ కాదు కాబట్టి మంచి సినిమాటిక్‌ అంశాలను కూడా దీని నుంచి ఆశించవచ్చు. 

వరుసగా రెండు చిత్రాలు నిరాశపరిచినా కూడా నాని క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని చెప్పడానికి ‘జెర్సీ’కి జరిగిన ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చూస్తే అర్దమవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్‌ రైట్స్‌ 30కోట్లు, శాటిలైట్‌ 12కోట్లు, ఓవర్‌సీస్‌ 4కోట్లు, ఇతరత్రా కోటికి పైగానే ఈ చిత్రం ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. మరి ఆ మొత్తాన్ని తిరిగి రికవరి అయి లాభాలు వచ్చేలా చేస్తే మాత్రం నాని ఇక నుంచి 50కోట్లకు పైగా కంటిన్యూగా తన సత్తా చూపడం ఖాయమనే చెప్పాలి. 



By February 01, 2019 at 06:08AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44521/nani.html

No comments