Breaking News

ప్రభుత్వాలకు లేని దురద సినిమా వాళ్లకెందుకు?


వాస్తవాన్ని ఒప్పుకోవాలంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా సినీ పరిశ్రమకు ఎంతో అనువైన చోటు వైజాగ్‌ అనే చెప్పాలి. చెన్నైకి థీటుగా వైజాగ్‌, అరకు, బోర్రా వంటి ప్రదేశాలు అద్భుతంగా కనుల పండువగా ఉంటాయి. ఇక సముద్రపు అందాలు, పోర్ట్‌ వంటివి అదనం. అందుకే నాడు మద్రాస్‌ నుంచి తెలుగు పరిశ్రమకు ఎక్కడకు తరలించాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు చాలా మంది వైజాగ్‌ వైపే మొగ్గుచూపారు. 

కానీ నాటి రాజకీయనాయకులు చేసిన పెద్ద తప్పిదం ఏమిటంటే మద్రాస్‌ తర్వాత ఊటీకి ఉన్న స్థానాన్ని హైదరాబాద్‌ తర్వాత వైజాగ్‌కి ఇవ్వకుండా మొత్తం పరిశ్రమనే ఒకే చోట కేంద్రీకరించడం. ముఖ్యంగా నాటి ముఖ్యమంత్రులందరు సినీ పరిశ్రమ నుంచి ఐటి వరకు అంతా హైదరాబాద్‌కే మోసుకెళ్లారు. అలా ఒకే చోట కేంద్రీకరించడం ద్వారా చివరకు చంద్రబాబునాయుడు వంటి వారు చేసిన ఘోరతప్పిదం విభజన సమయంలో అందరికీ తెలిసి వచ్చింది. 

అయినా హైదరాబాద్‌లో అప్పటికే ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ, రామానాయుడు వంటి వారందరికీ అతి తక్కువ రేటుకే భూములను అప్పనంగా ఇవ్వడంతో అందరు కలసి హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. ఇక విశాఖకి చెందిన రామోజీరావు సైతం రామోజీ ఫిలింసిటీని హైదరాబాద్‌లోనే పెట్టాడు. ఇన్ని చేసినా సినీ పరిశ్రమ హైదరాబాద్‌లో పూర్తిగా స్థిరపడటానికి ఎన్నో దశాబ్దాలు పట్టింది. 

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ వెళ్లిపోవడం, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా అక్కడే సినీ పరిశ్రమను ఉంచేలా వ్యూహాత్మంగా వ్యవహరించడంతో గ్లామర్‌తో పాటు, ప్రభుత్వ ఆదాయం కూడా తెలంగాణలోని హైదరాబాద్‌కే వెళుతోంది. ఇక కొత్తగా ఏపీ ఏర్పడిన తర్వాత ఏపీకి సినీ పరిశ్రమను తేవడంలో సినిమా వారంటే పడి చచ్చే చంద్రబాబు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేవలం వైజాగ్‌ చుట్టుపక్కల ఉన్న తన ఆస్థుల కోసం తప్ప వైజాగ్‌కి వస్తే ఇవి ఇస్తాం అని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా చెప్పలేకపోతున్నాడు. ఏదో ఒక సభలో వేదిక ఎక్కి వైజాగ్‌కి పరిశ్రమ రావాలని కోరుకోవడం మినహా ఆయన చేతల్లో ఏమీ చూపించడం లేదు. 

ఇక తాజాగా ఎఫ్‌2 వేడుకలో గంటా మాట్లాడుతూ, నాడు వెంకీ తండ్రిగారైన రామానాయుడుని అడిగాను. ఇప్పుడు వెంకటేష్‌ని కూడా అడిగాను. ఇక్కడ తమ చిత్రాలలో కొంత షూటింగ్‌ ఖచ్చితంగా జరుపుతామని హామీ ఇచ్చారు. దిల్‌రాజు కూడా అదే చెప్పారు అంటూ ప్రసంగించాడు కానీ కనీసం సినీ పరిశ్రమ వైజాగ్‌కి రావడానికి ఏమేం చర్యలు తీసుకుంటున్నారో చెప్పలేకపోయాడు. 

ఇక ఏపీలోని చెన్నై బోర్డర్‌ అయిన నెల్లూరు జిల్లా తడ కూడా షూటింగ్‌లకు అనువైన ప్రాంతం అనేది నిజం. పక్కనే చెన్నై ఉండటం ఇక్కడ కలిసొచ్చే అంశం. అయినా ప్రభుత్వాలకు లేని శ్రద్ద.. సినిమాలను వ్యాపారంగా తీసుకునే నిర్మాత, దర్శకులకు ఎందుకు ఉంటుంది? కందకు లేని దురద కత్తి పీటకు ఎందుకు అనేది మాత్రం వాస్తవం. ఇదే అభిప్రాయాన్ని గతంలో సినీ పెద్ద తమ్మారెడ్డి భరద్వాజ్‌ కూడా వెల్లడించడం విశేషం. 



By January 01, 2019 at 09:09AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44106/ganta-srinivasa-rao.html

No comments