Breaking News

పవన్ పోటీ చేయట్లేదు: కేసీఆర్ వ్యూహమా?


ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో జనసేన పార్టీ బరిలో ఉండటం దాదాపు ఖాయమే. అన్నిసీట్లలోనూ తాము పోటీ చేస్తామని జనసేనాధినేత పవన్‌కళ్యాణ్‌ గట్టిగా చెబుతున్నారు. కానీ తెలంగాణ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ పోటీ చేయడం లేదనేది దాదాపు ఖరారే. అయితే తూర్పుగోదావరి జిల్లాలో పర్యటనల్లో ఉన్న పవన్‌ అకస్మాత్తుగా ముంబై వెళ్లడం, అక్కడే టిఆర్‌ఎస్‌ ఆపద్దర్మ మంత్రి కేటీఆర్‌ ఉండటంతో వీరిద్దరి మధ్య భేటీ జరిగిందనే వార్తలు బాగా వ్యాపించాయి. మరోవైపు తెలంగాణలో వెలమ సామాజిక వర్గానికి మంచి బలం ఉన్న మాట నిజమే కానీ, అక్కడ ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు చాలా తక్కువ. కేసీఆర్‌, టిఆర్‌ఎస్‌లు వెలమల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

మరోవైపు తెలంగాణలో రెడ్డి, కమ్మ వర్గానికి కూడా ఎంతో బలమైన స్థానం ఉంది. వచ్చే ఎన్నికల్లో మహాకూటమిలో కాంగ్రెస్‌, టిడిపి, కోదండరాం వంటి పార్టీలు ఉండటంతో రెడ్డి, కమ్మ సామాజిక వర్గం మహాకూటమికి ప్లస్‌ కానుంది. మరోవైపు తెలంగాణలో కొన్నిచోట్ల కాపుల ఓట్లు కూడా ఎంతో కీలకం. దాంతో ఆ ఓట్లు టిఆర్‌ఎస్‌ నుంచి వెళ్లిపోకుండా కాపు ఓట్లలో చీలక రాకుండా ఉండేందుకే పవన్‌ని తెలంగాణలో పోటీ చేయనివ్వకుండా నిలువరించగలిగారని, దీనికి కేంద్రంలోని బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాతో కలిసి కేసీఆర్‌ వ్యూహం రచించాడని అంటున్నారు. అంతేకాకుండా తెలంగాణ ఎన్నికల్లో పెద్దగా బలంలేని జనసేన పార్టీ పోటీలో ఉండి, ఓడిపోతే దాని ప్రభావం ఖచ్చితంగా ఏపీలో పడుతుంది. 

పవన్‌, జగన్‌లు తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉండటానికి ఇది కూడా ఓ కారణమనే తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు తమ అస్త్రశస్త్రాలను, బలాన్ని కేవలం ఏపీపైనే దృష్టి సారించాయి. కేవలం మహాకూటమి పేరుతో కాంగ్రెస్‌తో తెలుగుదేశం జతకట్టడం అనే అంశాన్నే ఇరు పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాయి. మరి రాబోయే తెలంగాణ ఎన్నికల్లో అక్కడ మహాకూటమి అధికారంలోకి వస్తే జనసేన, జగన్‌ల పరిస్థితి ఏమిటి? అనేది మాత్రం ప్రశ్నార్ధకం కానుంది. 



By November 21, 2018 at 01:43PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43586/pawan-kalyan.html

No comments