జెస్సీ పాత్రే నాకో దారి చూపించింది: సమంత!
తమిళనాట పుట్టి, తెలుగింటి కోడలిగా అడుగుపెట్టిన అక్కినేని ఫ్యామిలీ కోడలుగా మారిన సమంత పెళ్లయిన తర్వాత కూడా క్రేజీ నటిగా అగ్రస్థానంలోనే కొనసాగుతూ ఉండటం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్ అయిన ఈమె తాజాగా తనలోని భావాలను మీడియాతో పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏ పాత్ర నటీనటులకు ఎంతగా నచ్చుతుందో చెప్పలేం. అయితే, ఏ పాత్రనైనా సులభంగా చేయగలమని ఏ నటీనటులు అనుకోకూడదు. సుదీర్ఘ నా నటనా ప్రస్థానంలో నేను నటించిన ప్రతి పాత్రా ఎంతో ముఖ్యమైనదే. చేసే పాత్రను అర్ధం చేసుకుని, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేందుకు ప్రయత్నిస్తాను.
అలా సినిమాలలోని పాత్రల ద్వారా నిజజీవితంలోని మంచి చెడులను కూడా ఎంతో దగ్గరగా చూడగలిగాను. వాటి ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నేను నటించిన ‘ఏ మాయచేశావే’ చిత్రంలోని జెస్సీ పాత్రను జీవితంలో మరువలేను. అది నన్ను బాగా మార్చిన పాత్ర, నేను నటిగా స్ధిరపడటానికి జెస్సీ పాత్రనే కారణం. ఆ పాత్ర తర్వాతే నాకు ఎలాంటి పాత్రలు ఇవ్వాలో దర్శకులు నిర్ణయించుకోగలిగారు. ఆ దిశగా వారిని ఆలోచింపజేసి మంచి పాత్రలు నాకు రావడానికి మూల కారణం జెస్సీ పాత్రనే. అప్పటి నుంచి పాత్రల విషయంలో బాగా ఆలోచించి ఎంపిక చేసుకుంటూ వచ్చాను. ఆ ప్రయాణమే నన్ను నటిగా ఈ స్థాయిలో నిలబెట్టింది.. అని చెప్పుకొచ్చింది.
కాగా ఇటీవలే ‘యూటర్న్’ వంటి ప్రయోగాత్మక చిత్రంలో నటించిన సమంత త్వరలో మరో ప్రయోగాత్మక చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పిందని సమాచారం. ఈ మూవీ కోసం ఆమె 70ఏళ్ల ముదుసలి పాత్రలో నటించనుందని టాక్. దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.
By November 04, 2018 at 04:43AM
No comments