సంక్రాంతి లిస్ట్‌లోకి మరో స్టార్ హీరో సినిమా
దసరా సీజన్ తర్వాత సినిమాలకు అతి పెద్ద పండుగ ఏదయ్యా అంటే అందరూ ఖచ్చితంగా ‘సంక్రాంతి’ అనే చెబుతారు. అందుకే స్టార్ హీరోలు సంక్రాంతి సీజన్‌లో తమ సినిమా ఉండేలా చూసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో మరీ ముఖ్యంగా నందమూరి నటసింహం బాలయ్యకు సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు కాలుకి కత్తి కట్టుకుని మరీ రెడీ అవుతాడు. సంక్రాంతి సీజన్‌ని బాలయ్య అస్సలు మిస్ చేసుకోడు. అందుకే ప్రస్తుతం తను చేస్తున్న ‘NTR’ రెండు పార్ట్‌లను సంక్రాంతికి ముందు, తర్వాత వచ్చేలా ప్లాన్ చేశాడు. ఇక ఈసారి బాలయ్యతో పోటీ పడేందుకు మెగా హీరో రామ్ చరణ్ రెడీగా ఉన్నాడు. నిన్న మొన్నటి వరకు ఈ సినిమా సంక్రాంతికి కష్టమే అని వార్తలు వచ్చినప్పటికీ.. తాజాగా వచ్చిన టీజర్‌తో సంక్రాంతికి పక్కా అనేలా క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమాలతో పాటు వెంకీ, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్2 కూడా సంక్రాంతి బరిలో ఉంది. ఇక ఇప్పడు తాజాగా మరో మూవీ సంక్రాంతి లిస్ట్‌లోకి చేరువయ్యేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇది డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ కాదు కానీ.. తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో చిత్రమే కావడం విశేషం. ఆ హీరో మరెవరో కాదు తాలా అజిత్.
కోలీవుడ్ హీరోలైన రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న హీరో అజిత్. దాదాపు ఇటువంటి ఫాలోయింగే ఉన్న విజయ్ ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా తన ‘సర్కార్’తో సత్తా చాటుతున్నాడు. ఇక అజిత్ ప్రస్తుతం చేస్తున్న ‘విశ్వాసం’ చిత్రంతో సంక్రాంతికి సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే శివ - అజిత్ కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు మంచి విజయం సాధించడంతో.. వీరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ నాల్గవ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
అజిత్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించే ఈ ‘విశ్వాసం’ చిత్రం ప్రస్తుతం టాకీపార్ట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అగ్రతార నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ కావడం సినిమాపై మరింతగా అంచనాలను పెంచేస్తోంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు. దీంతో కోలీవుడ్‌లో ఏమోగానీ.. టాలీవుడ్‌లో మాత్రం సంక్రాంతి ఫైట్ మహా రంజుగా ఉండబోతుందనేది తెలుస్తుంది.
By November 11, 2018 at 10:50AM
No comments