రానా.. చైతూని భలే ఇరికించేశాడు..!
దేశానికి రాజైనా, ప్రపంచదేశాలను కనుచూపుతో శాసించే వారైనా, సామాన్యులైనా కూడా భార్యావిధేయులే అని లోకోక్తి ఉంది. ఎవరైనా సరే భార్యల అదుపులో ఉండి వారి విధేయులుగా ఉండాల్సిందే. అందుకే ఇంట్లో పిల్లి,.. వీధిలో పులి అనే సామెత కూడా ఎంతో ప్రాచుర్యం వహించింది. ఇక విషయానికి వస్తే హీరో నాగచైతన్య మిగిలిన చాలా మంది హీరోలకంటే జీవితంలో త్వరగా వివాహం చేసుకుని ఒక ఇంటి వాడయ్యాడు. తన సహనటి సమంతను వివాహం చేసుకున్న ఈ జంటను టాలీవుడ్‌లో స్వీట్ కపుల్స్ అని పిలుస్తారు.
ఇక అక్కినేని-దగ్గుబాటి ఫ్యామిలీలకు ఉన్న బంధుత్వం కూడా అందరికీ తెలుసు. అక్కినేని ఫ్యామిలీ హీరో నాగచైతన్య ఒక ఇంటివాడైనా.. దగ్గుబాటి హీరో అయిన రానా ఇంకా పెళ్లి విషయం దాటేస్తునే ఉన్నాడు. ఇక పోతే తాజాగా నాగచైతన్య నటించిన ‘సవ్యసాచి’ చిత్రం విడుదలైంది. డివైడ్‌టాక్‌తో నడుస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు చందు మొండేటి కాగా మైత్రి మూవీమేకర్స్ నిర్మించింది. కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీలో దేశం గర్వించదగ్గ నటుడు మాధవన్ ప్రతినాయకునిగా నటించగా, భూమిక.. చైతుకి అక్కగా, నిధి అగర్వాల్ చైతూకి జంటగా నటించింది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా హీరో నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటిలు రానా హోస్ట్‌గా నడుపుతున్న ‘నెంబర్ వన్ యారి’ షోకి విచ్చేశారు. మాటలు బాగా చెప్పడంలో రోజురోజుకి రాటుదేలి పోతోన్న రానా ఈ సందర్భంగా నాగచైతన్యని ‘తొందరపడి పెళ్లి చేసుకున్నానే అని ఎప్పుడైనా అనిపించిందా?’ అనే ప్రశ్న వేసి చైతుని ఆటపట్టించాడు.
‘అమ్మాయిలలో చైతు ఏది బాగా , ఎక్కువగా ఏం గమనిస్తాడు? ’ అని దర్శకుడు చందు మొండేటిని అడిగాడు. దానికి చందు రానాకి సమాధానం ఇస్తూ, ‘ఇప్పుడు వద్దులే అన్నా’ అని ప్రశ్నను దాటవేశాడు. వెంటనే రానా ‘షూటింగ్‌లో ఉన్నప్పుడు చైతుకి సమంత ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది?’ అని చందుని అడిగాడు. దానికి చందు సమాధానం ఇస్తూ, చైతు రెండు మూడుసార్లు ఫోన్ తీసుకుని కంగారుగా బయటకు వెళ్తాడు. ఆ కాల్స్ నాకు తెలిసి సమంత నుంచే వచ్చి ఉంటాయని భావిస్తున్నాను.. అని చెప్పడంతో సెట్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. కాగా ఈ షో ఆదివారం బుల్లితెరపై ప్రసారం కానుంది.
By November 05, 2018 at 07:55AM
No comments