Breaking News

అబ్బా.. థమన్.. ముందే చెప్పుండాల్సింది


తమన్‌.. అతి తక్కువ సమయంలోనే వరుసపెట్టి చిత్రాలు చేస్తూ ఉన్నాడు. దేవిశ్రీప్రసాద్‌కి సైతం సరైన పోటీగా నిలిచాడు. ఇక ఇతనిపై కాపీ క్యాట్‌ అనే ముద్ర విషయం పక్కన పెడితే ఓ పాట వింటే ఇది తమన్‌దేనని ఖచ్చితంగా చెప్పేంతగా తనకంటూ ఓ ముద్రవేసుకున్నాడు. గతకాలపు దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య గారి మనవడు, నెల్లూరు జిల్లాలోని పొట్టేపాలెం గ్రామంలో సంగీత కుటుంబంలో జన్మించాడు. తండ్రి ఘంటసాల శివకుమార్‌, తల్లి ఘంటసాల సావిత్రి, అత్త పి.వసంతలు కూడా సంగీత కళాకారులే. బాయ్స్‌ చిత్రంలో ఓ చిన్నపాత్ర పోషించిన థమన్ సంగీతం అందించిన మొదటి చిత్రం రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'కిక్‌'. 

ఇక ఈయన తన కెరీర్‌లో ఎన్నో సార్లు పడి, వెంటనే రెట్టింపు వేగంతో గోడకి కొట్టిన బంతిలా తిరిగిలేచాడు. మణిశర్మ తర్వాత నేపధ్య సంగీతం అందించడంలో ఆయనది అందెవేసిన చేయి. ఈయన తాజాగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించిన 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రానికి అద్భుతమైన సంగీతంతో పాటు ఎంతో ప్రాణం పోసే విధంగా బ్యాగ్రౌండ్ స్కోర్‌ అందించాడు. ఇక ఇటీవల వచ్చిన చిరంజీవి 151 చిత్రం 'సై..రా' మోషన్‌ పోస్టర్‌కి కూడా ఆర్‌.ఆర్‌. అందించాడు. ఇక ఏడాదికి పది పన్నెండు చిత్రాలు చేసే థమన్ తాజాగా పలు లెక్కల అనంతరం 'అరవింద సమేత వీరరాఘవ' మూవీ తన వందో చిత్రంగా ప్రకటించాడు. ముఖ్యంగా ఈ చిత్రంలోని 'పెనిమిటి' పాటకు ఈయన జీవం పోశాడు. 

కానీ దానికి తగ్గట్లుగా త్రివిక్రమ్‌ చిత్రీకరణ లేదనే విమర్శలు కూడా వచ్చాయి. మొత్తానికి దీనిని తన 100వ చిత్రంగా ముందుగానే థమన్ తెలిపి ఉంటే ఆయనకు ఈ చిత్రం ద్వారా మరింత మైలేజ్‌, పబ్లిసిటీ వచ్చి ఉండేవన్నది వాస్తవం. మొత్తానికి థమన్ ఇదే దూకుడు చూపిస్తూ పోతే అతి త్వరలోనే డబుల్‌ సెంచరీ సాదించడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఇటీవల కాలంలో థమన్ తనలోని వైవిధ్య సంగీత దర్శకుడిని 'భాగమతి, తొలిప్రేమ, అరవింద సమేత వీరరాఘవ' ద్వారా చాటిచెబుతూ ఉండటం మరింత సంతోషించాల్సిన విషయం. 



By November 03, 2018 at 02:15PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43324/ss-thaman.html

No comments