Breaking News

ఇవి కబడ్డీ పోటీలు కావు: ప్రకాష్‌రాజ్


కేసీఆర్‌ని చూస్తే భక్తో, భయమో తెలియడం లేదు గానీ సినీ నటులందరు మౌనంగా ఉండటమో లేక కేసీఆర్‌కి అనుకూలంగానో ఉంటూ వస్తున్నారు. ఇక తెలుగుదేశం అనేది తెలుగు వారు ఎక్కడ ఉన్నా అందరికీ వర్తించే పార్టీ. నాడు ఎన్టీఆర్‌ తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో సమైక్యాంధ్రలో స్థాపించిన పార్టీ. నాటి ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబునాయుడు వరకు ఆ పార్టీ తరపున సమైక్యాంధ్రను వారు ముఖ్యమంత్రులుగా పాలించారు. కానీ టీఆర్‌ఎస్‌ పరిస్థితి అది కాదు. దాని పేరులోనే తెలంగాణ అనే పేరు ఉంది. కాబట్టి టీఆర్‌ఎస్‌కి, తెలుగుదేశం పార్టీకి ముడిపెట్టడం వివేకం అనిపించుకోదు. 

ఇక ఎవ్వరికీ భయపడనని చెప్పే జనసేనాని పవన్‌కళ్యాణ్‌ కూడా కేవలం ఏపీనే టార్గెట్‌ చేస్తున్నాడు. మొదట్లో రెండు తెలుగు రాష్ట్రాలు నాకు ముఖ్యమే అని చెప్పిన ఆయన ఏపీలో కంటే ముందుగా తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నా కూడా అక్కడి తెలుగువారు ఎవరికి ఓటేయాలి? తాను ఎవరికి మద్దతు ఇస్తున్నానో ధైర్యంగా ప్రకటించలేని స్థితిలో ఉన్నాడు. ఇక ఎక్కడో కర్ణాటకకు చెందిన ప్రకాష్‌రాజ్‌ ఆమధ్య గౌరీలంకేష్‌ హత్యతో కదిలిపోయి కాంగ్రెస్‌కి అనుకూలంగా, బిజెపికి వ్యతిరేకంగా తన స్వరం వినిపిస్తున్నాడు. తాజాగా ఆయన తెలంగాణ ఎన్నికలపై, తెలంగాణలో టిడిపి పోటీ చేస్తున్న విషయంలో చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ, ఎవరు ఎక్కడినుంచైనా పోటీ చేయవచ్చు. అయితే టీఆర్‌ఎస్‌ వెళ్లి ఏపీలో పోటీ చేస్తే ఎలా ఉంటుందో చంద్రబాబునాయుడు ఆలోచించుకోవాలి? నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాను. కేసీఆర్‌ చెప్పినట్లు ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నవి కబడ్డీ పోటీలు కావు. కోట్లాది మందికి ఎంతో ముఖ్యమైన ఎన్నికలు. ఓటర్లు ఎప్పుడు ప్రేక్షకులుగా మిగిలిపోకూడదు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణకు కేసీఆర్‌ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. 

ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, టిడిపిలతో సంబంధం లేకుండా ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. రాష్ట్రం కోసం ఆలోచించి ఓటు వేయాలి. చంద్రబాబు గొప్ప నాయకుడు. అయితే ఆయన 15 సీట్లతో తెలంగాణకు సీఎం కాగలడా? భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు వస్తే ఆయన ఎటువైపు నిలుస్తారు? ఇక కాంగ్రెస్‌ అంటే నాకు ఇష్టమే. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నా ఫేవరేట్‌ నాయకుడు అని తెలిపాడు. అయినా టీఆర్‌ఎస్‌ని ఏపీ నుంచి పోటీ చేయమని కొందరు కోరుతున్నారని గతంలో కొందరు టీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పారు. మరి ఏపీలో వారు నిలబడితే కాదనేది ఎవరు? అనేదే ప్రశ్న..! 



By November 26, 2018 at 02:20PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43666/prakash-raj.html

No comments