సుహాసినికి ఎన్టీఆర్ సపోర్ట్.. అనుమానాలు షురూ!
ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావుగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మాకు ఎంతో పవిత్రమైనదని తెలిపారు నందమూరి కళ్యాణ్ రామ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ‘‘మా నాన్నగారు స్వర్గీయ నందమూరి హరికృష్ణగారు సేవలందించిన తెలుగుదేశం పార్టీ తరపున ఇప్పుడు మా సోదరి సుహాసినిగారు కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. సమాజంలో స్త్రీలు ఉన్నతమైన పాత్రను పోషించాలని నమ్మే కుటుంబం మాది. ఇదే స్ఫూర్తితో ప్రజాసేవకు సిద్ధపడుతున్న మా సోదరి సుహాసినిగారికి విజయం వరించాలని ఆకాంక్షిస్తూ.. జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ..’’ అంటూ నందమూరి కళ్యాణ్ రామ్ మరియు ఆయన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ ఓ ప్రకటనను విడుదల చేశారు.
ఈ ప్రకటన నందమూరి ఫ్యామిలీపై వారికున్న అభిమానాన్ని, బాధ్యతను తెలియజేస్తుంది. అయితే తాతగారు స్థాపించిన అని చెప్పారు కానీ, ఎక్కడా ఏపీ సిఎమ్ చంద్రబాబు పేరును.. వారు ఈ ప్రకటనలో ప్రస్థావించకపోవడంపై ఆసక్తికర కథనాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సోదరి కోసం వారి ప్రేమను తెలియజేశారు కానీ, ఎక్కడా ప్రచారానికి పాల్గొంటామని కానీ, అవకాశం ఇచ్చిన వారికి కానీ వారు కృతజ్ఞతలు తెలుపలేదు. దీంతో వీరిద్దరు ఇప్పటి వరకు సుహాసిని తరుపున ప్రచారానికి వస్తారనే వార్తలపై అనుమానం వ్యక్తమవుతుంది.
అయినా రాజకీయాలలో ఏది ఎప్పుడు జరుగుతుందో చెప్పడం, ఊహించడం కూడా చాలా కష్టం. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా స్థాపించిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి మహాకూటమిగా ఏర్పడి ఎన్నికలకు రెడీ అవుతోంది. అలాగే రేపు ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు కూడా చంద్రబాబుకు జై కొడుతూ.. ప్రచారం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అవసరాలు అలాంటివి మరి.
By November 18, 2018 at 09:46AM
No comments