పవన్ క్లారిటీ ఇచ్చాడు.. ఇంక ఆపుతారా?
పారిశ్రామిక వేత్తలు నుంచి సినిమా వారి వరకు రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చే ముందు, ఎంట్రీ ఇచ్చిన తర్వాత బాగా సాగినంత కాలం తాము ఇక ప్రజాసేవకే అంకితమని అంటారు. తమకు ప్రజాక్షేమమే ముఖ్యమని, కాబట్టి ఇక తమ జీవితం ప్రజాజీవితంతోనే ముడిపడి ఉందని అంటారు. కానీ ఒకసారి ఎన్నికలు జరిగిన తర్వాత మరోసారి సినిమాలపై దృష్టి సారిస్తారు. ప్రజాసంక్షేమంతోపాటు తమకు అన్నం పెట్టిన కళామతల్లి కూడా ముఖ్యమేనని మాటలు దంచుతారు. ఈ విషయం ఎన్టీఆర్ నుంచి కోటశ్రీనివాసరావు, బాబుమోహన్, చిరంజీవిల వరకు మనం చూసిన తంతే.
కాగా ప్రస్తుతం జనసేన పార్టీ వ్యవహారాలలో, ప్రచారాలలో బిజీగా ఉన్న జనసేనాని పవన్‌కళ్యాణ్ త్వరలో ఓ సినిమాలో నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆయన సోషల్‌మీడియా ద్వారా వాటికి చెక్ పెట్టారు. నేను త్వరలో సినిమాలో నటిస్తానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. సినిమాలలో నటించే సమయం నాకు లేదు. పార్టీకే పూర్తి సమయం కేటాయిస్తాను. ప్రజల్లోనే ఉంటూ కార్యకర్తలు, జనసైనికులు, అభిమానులతో కలిసి పాలకుల తప్పిదాలను బలంగా వినిపిస్తున్న ఈ తరుణంలో సినిమాలపై దృష్టి సారించలేను. నా ఆలోచనలన్నీ ప్రజా సంక్షేమం కోసమే. నా తపనంతా సమసమాజ స్థాపనకే అని పవన్ వెల్లడించాడు. చివరగా పవన్‌కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది.
అంతేకాదు పవన్ మొదటి నుంచి తనకు నటనంటే ఇష్టం లేదని చెబుతూనే ఉన్నాడు. తనకు ఫైట్స్, డ్యాన్స్‌లు, నటించేటప్పుడు సౌకర్యంగా ఫీలవ్వనని, తనకు నటనపై ఇంట్రస్ట్ లేదని చెప్పేవాడు. ఆయన ఎంచుకునే చిత్రాలు, అందులో ఆయన చూపించే నటన కూడా పవన్ ఏదో ఇష్టం లేక తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నట్లుగా అన్యమనస్కంగా ఉండేవాడు. సో.. పవన్ వచ్చే ఎన్నికల్లో గెలిచినా, ఓడినా రాజకీయాలకే పరిమితం అవుతాడా? లేక అన్ని విషయాలలో తన అన్నయ్యనే అనుసరిస్తున్న ఆయన వచ్చే ఎన్నికల్లో సరైన ఫలితాలు సాధించడంలో జనసేన విఫలం అయితే మరలా సినిమా బాట పడతాడా? అనేది కాలమే నిర్ణయించాలి..!
By November 22, 2018 at 06:28AM
No comments