సినిమాలో దమ్ముంటే.. ఇది సమస్యే కాదు!!
ఒకప్పుడు అన్ని భాషల్లోని చిత్రాల నిడివి 3గంటలకు పైగానే ఉండేది. ఈమధ్యవరకు బాలీవుడ్ చిత్రాలు కూడా ఎక్కువ నిడివి కలిగి ఉండేవి. కానీ ఇప్పుడు కాస్త ట్రెండ్ మారింది. ప్రేక్షకులు అన్ని గంటలు థియేటర్లలో కూర్చుని సినిమా చూసే ఓపిక లేకుండా పోయింది. దాంతో ఎడిటింగ్ టేబుల్ వద్ద పని ఎక్కువైంది. మన ప్రేక్షకులు కూడా చెప్పాలనుకున్నది సూటిగా, స్పష్టంగా హాలీవుడ్ చిత్రాల తరహాలో చెబితే ఆదరిస్తున్నారు. మహా అయితే ఒకే చిత్రాన్ని రెండు పార్ట్‌లుగా మారుస్తున్నారు. కానీ ఇటీవల విడుదలైన ‘రంగస్థలం’తోపాటు పలు చిత్రాలు నిడివి ఎక్కువైనా కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కాబట్టి ఈ ట్రెండ్ అనేది పెద్దగా నిజం కాదనే నిరూపితం అయింది.
ఇక విషయానికి వస్తే సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రాలు ఎంత ఎక్కువ నిడివి ఉంటే ఆయన అభిమానులకు అంత ఇష్టం. ఎందుకంటే తమ అభిమాన నటుడిని వీలైనంత ఎక్కువ సేపు చూసుకోవచ్చు.. ఆయన స్టైల్‌ని తనివితీరా ఆనందించవచ్చు అనేది కారణం. ఇక శంకర్ సినిమాలు కూడా కాస్త ఎక్కువ నిడివితోనే ఐఫీస్ట్‌ని కలిగించే సన్నివేశాలు, లొకేషన్లు, విజువల్స్, పాటలతో నిండి ఉంటాయి. కానీ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా అక్షయ్‌కుమార్ ప్రతినాయకునిగా, అమీజాక్సన్ వంటి వారు నటిస్తున్న ‘2.ఓ’ చిత్రం మరో ఎనిమిది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది.
ఇక ఇటీవల కాలంలో రజనీకి కూడా శివాజీ, రోబోల తర్వాత సరైన హిట్ లేదు. దాంతో దేశవ్యాప్తంగా సినీ అభిమానులందరు ఈ చిత్రం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక విషయానికి వస్తే ‘2.ఓ’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. 550 కోట్లతో రూపొందిన ఈ చిత్రం నిడివి రెండున్నర గంటలు కూడా లేదట. ఖచ్చితంగా చెప్పాలంటే రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల 52 సెకన్ల నిడివితో దీనిని శంకర్ తీశాడు. సినిమాలోని ఏ సీన్స్‌కి కూడా కట్ చెప్పని సెన్సార్‌బోర్డు కొన్ని పదాలను మాత్రం మ్యూట్ చేసిందని సమాచారం. గతంలో శంకర్ తీసిన ముఖ్యచిత్రాలన్నింటిలోకి ఈ చిత్రం నిడివి మాత్రమే చాలా తక్కువ అని తెలుస్తోంది.
By November 22, 2018 at 07:22AM
No comments