సినిమాని సినిమాగా చూసే రోజులు పోయాయా?
ఒకప్పుడు ఏకంగా మాలపిల్ల టైటిల్‌తో ఓ చిత్రం వచ్చింది. ఇప్పుడు మంచి చెప్పాలనుకుని మాలల బాధలు తెలిపేందుకు సినిమా తీసినా ఇదే టైటిల్‌ని పెట్టే పరిస్థితులున్నాయా? అంటే లేవనే చెప్పాలి. నాటి అమరప్రేమికుడైన దేవదాస్‌ని మద్యం తాగకుండా, సిగరెట్టు కాల్చకుండా ఉంటే అసలా పాత్ర అలా చిరస్థాయిగా మిగిలిపోయేదా? అనిపిస్తుంది. ఇక ‘ప్రేమాభిషేకం, పాండురంగ మహత్మ్యం, ప్రేమనగర్’ వంటి చిత్రాలలో కథానాయకులకు దురలవాట్లు ఉండేలా చూపించకపోతే సినిమాకి అర్ధం పరమార్ధమే ఉండదు. నేడు ‘చింతామణి, కన్యాశుల్కం’ వంటి సినిమాలు వచ్చినా నిరసన తప్పదేమో అనిపిస్తోంది. విలన్ గ్యాంగ్‌ని, చెడు ప్రవర్తన కలిగిన వారిని బీడీలు, సిగరెట్లు, మద్యం, సిగారులు లేకుండా చూపడం సాధ్యమా? విలనిజాన్ని చూపించే కోణాలు, విధానాలు ఎన్నో ఉన్నాయి. కానీ నేటి పరిస్థితి అలా లేదు. సినిమాలలో పొగ, మద్యమే కాదు... చివరకు ఏ చెడును చూపించకుండా సినిమాలు తీయాలని కొందరు వాదిస్తున్నారు. వారి వాదనలో కూడా నిజం ఉంది. ఎందుకంటే కోట్లాది ప్రజలను ప్రభావితం చేసే వారు ఇలాంటివి చేస్తూ కనిపించడం వల్ల యువత చెడు మార్గంలో పయనిస్తుందనేది వారి బాధ.
కానీ మనకి ఏనాడో సిగరెట్లు, మద్యం వంటివి చాలా సామాన్యమైపోయాయి. మైనర్ పిల్లలు, ఆడవారిలో కూడా ఇదే సంస్కృతి కనిపిస్తోంది. మరి ఇంతలా దుష్ప్రభావం చూపిస్తాయని అనుకుంటే గుట్కాలలాగా మద్యం, సిగరెట్లు వంటి పొగాకు వస్తువులన్నింటిపై దేశవ్యాప్త నిషేధం విధించేందుకు నడుం బిగించాలే గానీ కేవలం సినిమాల మీదనే ఆంక్షలు సరికావు. రజనీకాంత్, కమల్‌హాసన్, అజిత్, విజయ్ వంటి హీరోలు ఇప్పటికే పీఎంకే నేత రాందాస్ పుణ్యమా అని తమ చిత్రాలలో అలాంటి సీన్స్ లేకుండా చూసుకుంటున్నారు. అంత మాత్రాన తమిళనాడులో వీటి వాడకం పెరిగిందా? తగ్గిందా? అంటే పెరిగిందనే చెప్పాలి. సిగరెట్ల బదులు చూయింగ్‌గమ్‌లతో విన్యాసాలు చేస్తూ ఉన్నా మద్యం, సిగరెట్లు పోయి ఏకంగా డ్రగ్స్ స్థాయికి మనం చేరుకున్నాం.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ -పూరీ కాంబినేషన్‌లో వచ్చిన ‘టెంపర్’ చిత్రానికి విశాల్ హీరోగా రీమేక్ రూపొందుతోంది. ఇందులోని ఓ లుక్‌ని ఇటీవల విడుదల చేశారు. ఇందులో విశాల్ పోలీస్‌జీప్‌పై కూర్చుని బీరు తాగుతూ ఉన్నాడు. దీంతో సమాజ ఉద్దారకులందరు రోడ్డెక్కారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, పదిమందికి మంచి చెప్పే హీరో విశాల్ ఇలా కనిపించడం ఏమిటని మండిపడుతున్నారు. కానీ తెలుగు ‘టెంపర్’ చిత్రం చూసిన ఎవరికైనా చెడుగా ప్రవర్తించే ఓ క్రిమినల్ వంటి నెగటివ్ ఛాయలున్న పోలీస్ పాత్ర హీరోది. మరి అలా కూడా చూపించడానికి వీలులేదు అంటే అది సినిమా వారి ముందరి కాళ్లకు బంధాలు వేయడమేనని చెప్పాలి.
By November 22, 2018 at 07:30AM
No comments