Breaking News

నిరూపితం: కంటెంట్ ఉంటే ఎవడేం ఈకలేడు!


కేవలం పైరసీ ద్వారానే సినిమాలు ఆడకుండా పోతున్నాయని, కలెక్షన్లు తగ్గుతున్నాయనే వాదనలో పెద్దగా పసలేదు. మహా అయితే రిపీట్‌ ఆడియన్స్‌ సంఖ్య తగ్గుతుందేమో గానీ కొన్ని చిత్రాల లీక్‌లు, పైరసీల వల్ల కూడా సినిమాలకు మేలు జరిగే అవకాశాలు బాగా ఉంటాయి. అందుకే కొంత కాలం కిందట బాలీవుడ్‌లో సినిమా రిలీజ్‌తో పాటే సగం స్క్రీన్‌పై యాడ్స్‌ వేస్తూ ఆ సినిమా వీడియో క్యాసెట్లను కూడా సినిమాతోపాటే రిలీజ్‌ చేసిన సందర్భాలున్నాయి. ఒక సినిమా లీక్‌ని గానీ, పైరసీని గానీ చూసి సినిమా బాగుందే అనిపిస్తే ప్రేక్షకులే ఈ చిత్రాన్ని థియేటర్లలో చూస్తే ఇంకా బాగా మజా వస్తుందని థియేటర్లకు క్యూకడుతారు. మహా అయితే సినిమా ఎంత బాగున్నా థియేటర్లకు రాని మహిళలు, ముసలి ముతక మాత్రమే పైరసీ చూసి కామ్‌గా ఉండిపోతారు. 

కానీ నేడు సినిమాలకు యూత్‌ మహాపోషకులుగాఉన్నారు. వీరికి ఒకసారి సినిమా ఎక్కితే చాలు వారే మరలా మరలా చూస్తూ మౌత్‌టాక్‌తో సినిమా ఆదాయాలకు మౌత్‌పీస్‌లుగా మారుతారు. ఈ విషయం ‘అత్తారింటికి దారేది’ నుంచి తాజాగా వచ్చిన ‘టాక్సీవాలా’ వరకు నిజమేనని నిరూపించింది. ‘టాక్సీవాలా’తో పాటు రిలీజైన రవితేజ ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ చిత్రం ముందుగా లీక్‌ కాకపోయినా ఆ చిత్రానికి రెండో షో నుంచే జనాలు ఖాళీ అయ్యారు. అదే ‘టాక్సీవాలా’ చిత్రం కొత్త దర్శకుడైనా సరే.. మంచి కంటెంట్‌ ఉండటం వల్ల వీక్‌డేస్‌లో కూడా ఓ ఊపు ఊపేస్తోంది. మొదటి రెండు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ సాధించి లాభాల బాట పట్టింది. ‘2.ఓ’ విడుదలయ్యే వరకు ఈ చిత్రం హవా సాగుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే ఈ చిత్రం లాభాల పంట పండిస్తుందనడంలో సందేహం లేదు. తాజాగా సినీ ప్రముఖుడు, సినీ పెద్ద తమ్మారెడ్డి భరద్వాజ ‘టాక్సీవాలా’ చిత్రంపై తన విశ్లేషణ ఇచ్చాడు. 

ఆయన మాట్లాడుతూ.. విడుదలకు ముందే ఈ చిత్రాన్ని కొందరు లీక్‌ చేశారు. ఈ సినిమాని చంపేశామని వారు సంబరపడి పోయి ఉంటారు. గీతాఆర్ట్స్‌ వారు ఈ సినిమాని విడుదల చేయడం లేదని, ప్రింట్‌ని తగలబెట్టే ఆలోచనలో ఉన్నారని మరికొందరు ప్రచారం చేశారు. అలాంటి వారందరికీ ఈ సినిమా సక్సెస్‌ సమాధానం చెప్పింది. పైరసీ సినిమాలను థియేటర్లలో చూడరని వాదించే వారికి ఈ చిత్రం గుణపాఠం చెప్పింది. సినిమాలో దమ్ముంటే థియేటర్లకు వచ్చేవారిని పైరసీ ఆపలేదని మరోసారి రుజువైంది. సినిమాలో దమ్ము లేకపోతే ఆ చిత్రాన్ని జనాలు పైరసీలో చూసేందుకు కూడా ఇష్టపడరు. అదే విషయాన్ని ‘టాక్సీవాలా’ చిత్రం మరోసారి నిరూపించింది అని స్పందించాడు. ఈ విషయంలో తమ్మారెడ్డి చెప్పిన మాటలు అక్షరసత్యాలనే చెప్పాలి.



By November 24, 2018 at 01:14AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43620/taxiwala.html

No comments