Breaking News

శబరిమల, మీటూపై రజినీ ఏమన్నారంటే?


ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కి ఎంతో ఉదారవాదిగా, అజాత శత్రువుగా పేరుంది. కానీ కొన్నిసార్లు ఆయన మాటలను తప్పుగా అర్ధం చేసుకుంటూ వక్రీకరిస్తూ ఉండటంతో కాస్త వివాదాలకు గురవుతున్నాడు. మరోవైపు ఇటీవల తన చిత్రాలు బయ్యర్లకు నష్టాలు తేవడం, వారు కూడా రజనీ తమ నష్టాలని పూడ్చాలని ధర్నాలతో రోడ్డెక్కడం వంటివి చేస్తూ రజనీ ఇమేజ్‌కి భంగం కలిగిస్తున్నారు. నిజానికి రజనీ ఓ వ్యక్తి కాదు.. శక్తి అనే చెప్పాలి. ఆయన జీవన విధానం, ఆధ్యాత్మిక చింతన, హిమాలయాలలో ధ్యానంలో గడపడం వంటివన్నీ అందరికీ తెలిసిందే. నిజ జీవితంలో ఎంతో సింపుల్‌గా ఉండే రజనీ మాట చెబితే దానిని దైవవాక్కుగా భావించే వీరాభిమానులు మరో హీరోకి లేరంటే కూడా అతిశయోక్తి కాదు. 

ఇక ఇటీవల ఆయన రాజకీయాలలోకి వస్తానని ప్రకటించాడు. ఆధ్యాత్మిక చింతన కలిగిన రాజకీయాలు చేస్తానని తెలిపాడు. మరోవైపు ఆయన త్వరలో వచ్చే పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికలలోపు పార్టీని స్థాపించి, ఎన్నికలకు పోయే ఆలోచన లేనట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆయన కమల్‌హాసన్‌లా కాకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. బహుశా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాటికి ఆయన పార్టీని స్థాపించి, ఎన్నికల్లో పోటీ చేస్తాడని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు రజనీ నటించిన '2.ఓ' వచ్చే నెలలో విడుదల కానుంది. ఇక ప్రస్తుతం ఆయన కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో సన్‌పిక్చర్స్‌ బేనర్‌పై 'పేటా' చిత్రంలో నటిస్తున్నాడు. 

ఇక విషయానికి వస్తే ఇటీవల సుప్రీంకోర్టు మూడు నాలుగు కీలక తీర్పులను ఇచ్చింది. స్వలింగ సంపర్కం తప్పుకాదని, ఇష్టపడి ఎవరైనా వివాహేతర సంబంధం పెట్టుకోవడం కూడా నేరం కాదని తెలిపింది. ఇక మూడో తీర్పు మాత్రం ప్రస్తుతం కేరళ రాష్ట్రాన్నే కాదు.. హిందు మతవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అదే శబరిమలలో మహిళలకు ప్రవేశం విషయం. నిజానికి మత సంబంధమైన విషయాలలో ప్రజాభిప్రాయానికి, భక్తుల మనోభావాలకు, ఆలయ సంప్రదాయాలను గుర్తించకుండా సుప్రీంకోర్టు ఈ తీర్పుని ఇచ్చిందని స్వయంగా మహిళలే దీనిని వ్యతిరేకిస్తున్నారు. కేరళలో మహిళలు భారీగా, స్వచ్చంధంగా ముందుకు వచ్చి ఉద్యమం నడుపుతున్నారు. సుప్రీంకోర్టు శబరిమలలో ఇచ్చిన తీర్పులోని ఓ మహిళా జడ్జి కూడా మహిళలకు బహిష్టు వంటి సమస్యలు ఉంటాయని, కాబట్టి వారికి ప్రవేశం ఇవ్వడం సబబు కాదని వాదించింది. 

ఇక తాజాగా రజనీకాంత్‌ ఈ విషయంలో కీలకవ్యాఖ్యలు చేశాడు. శబరిమల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అందరు గౌరవించాలని తెలిపాడు. అదే సమయంలో ఆయన ఆలయ సంప్రదాయాలను, ఆచారాలను అందరు పాటించాల్సిందేనని కూడా తెలిపాడు. మరి ఈ రెండు వ్యాఖ్యల మధ్య అసలు పొంతనే లేకుండా ఉంది. ఇక రజనీ తాజాగా 'మీటూ' ఉద్యమంపై కూడా స్పందించాడు. మహిళలకు జరుగుతున్న వేధింపులను బయట పెడుతోన్న 'మీటూ' ఉద్యమానికి తాను మద్దతు ఇస్తున్నానని, కానీ దానిని తప్పుగా వాడుకోరాదని కోరాడు. 'మీటూ' ఉద్యమం మహిళలకు ఎంతగానో సహాయపడుతుందని, దానిని వారు సరిగా వాడుకోవాలని హితవు చెప్పాడు. ఇక వైరముత్తుపై గాయని చిన్మయి శ్రీపాద చేసిన ఆరోపణలపై స్పందిస్తూ వైరముత్తు తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడని, దానిపై ఆయన చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చెప్పాడు కాబట్టి అంతకు మించి దీనిపై ఏమీ వ్యాఖ్యానించలేనని తెలిపాడు. అయితే రజనీ ఏ నిర్ణయాన్ని స్ధిరంగా తీసుకోడని, తన మనోభావాలను కుండబద్దలు కొట్టేవిధంగా కాకుండా కర్ర విరగకుండా.. పాము చావకుండా వుండేలా మాట్లాడుతాడని ఈ వ్యాఖ్యలను బట్టే అర్ధం అవుతోంది. అయినా ముందుగా రజనీ 'మీటూ' ఉద్యమానికి మద్దతు ఇచ్చేముందు ఎన్నో ఆరోపణలు, ప్లేబోయ్‌ ఇమేజ్‌ ఉన్న తన అల్లుడు ధనుష్‌ విషయంలో తన అభిప్రాయం ఏమిటో తెలిపి ఉంటే బాగుండేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 



By October 23, 2018 at 10:57AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43146/rajinikanth.html

No comments