తండ్రిపై వచ్చిన ఆరోపణలపై నటి క్లాస్..!
దేశంలోనే నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న వారిలో షబానాఆజ్మీ, నందితా దాస్ వంటి వారిని ప్రముఖంగా చెప్పాలి. వీరిద్దరు మంచి సంఘసేవకులే కాదు. నిజమైన ఫెమినిస్ట్‌లు కూడా. ఎన్నో అవార్డులు, రివార్డులను కూడా సొంతం చేసుకున్న ఉత్తమ నటి నందితా దాస్ ఎన్నో అద్భుత కళాఖండాలలో నటించింది. మహిళపై లైంగికవేధింపుల నుంచి భర్త చనిపోయిన వితంతువులు, మహిళా స్వేచ్చ, స్త్రీలకు శృంగారం విషయంలో కావాల్సిన స్వాతంత్య్రం నుంచి లెస్బియనిజం వరకు ఆమె తన చిత్రాలలో చూపించింది. కమర్షియల్ చిత్రాల జోలికి వెళ్లకుండా వాస్తవిక చిత్రాలు, ఆఫ్‌బీట్ చిత్రాలుగా చెప్పుకునే సినిమాలలోనే నటించింది. ఎన్నో కమర్షియల్ మూవీస్‌లో అవకాశాలు వచ్చినా తిరస్కరించింది. ఈమెకి దేశంలోనే కాదు.. విదేశాలలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. దేశం గర్వించదగ్గ దర్శకదిగ్గజాలైన సత్యజిత్‌రే, మృణాళ్‌సేన్ , దీపామెహతా నుంచి అద్భుతనటి అనే కాంప్లిమెంట్స్‌ని అందుకుంది.
ఇక తాజాగా ఈమె తన తండ్రిపై వచ్చిన లైంగిక ఆరోపణలు ‘మీటూ’ ఉద్యమం గురించి తనదైనశైలిలో స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. నా తండ్రి జతిన్ దాస్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలు చూసి దిగ్భ్రాంతి చెందాను. కానీ నేను ఇప్పటికీ ‘మీటూ’ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నాను. నాతండ్రిపై వచ్చిన ఆరోపణలు నాకు కలతకు గురిచేశాయి. ఈ విషయంపై నా తండ్రి ఇప్పటికే వివరణ ఇచ్చి ఆ ఆరోపణలను ఖండించారు. నేను మీటూ ఉద్యమానికి బలమైన మద్దతుదారిని. లైంగిక వేధింపులకు గురయిన మహిళలకు నేను అండగా ఉంటాను. మహిళల ఆవేదనను ప్రతి ఒక్కరు వినాల్సివుంది. అప్పుడే మహిళలకు తమకెదురైన వేధింపులను, ఇతర విషయాలను నిర్భయంగా వెల్లడించగలుగుతారు.
ఇదే సమయంలో మహిళలు కూడా నిజాయితీగా ఉండాలి. స్వలాభం కోసమో, పబ్లిసిటీ కోసమో దీనిని తప్పు దారి పట్టించవద్దు. అలా తప్పుడు ఆరోపణలు చేస్తే ఉద్యమం నీరుగారి పోతుంది. ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది. నాతండ్రి విషయంలో నేను ఇంత వరకు మాత్రమే చెప్పగలను...అనిచెప్పుకొచ్చింది. కాగా నందితా దాస్ తండ్రి జతిన్‌దాస్‌కు చిత్రకారుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఓ పేపర్ తయారీ సంస్థకు సహయజమానిగా ఉన్న ఓమహిళ ఆయనపై లైంగికవేధింపుల ఆరోపణలు చేసింది. 14ఏళ్ల కిందట జతిన్ తనని లైంగికంగా వేధించాడని తెలిపింది. దీనిపై జతిన్ స్పందిస్తూ ‘అసభ్యం’ (వల్గర్) అంటూ కొట్టిపారేశాడు.
By October 18, 2018 at 01:34PM
No comments