మరో ఇండియన్ సినిమా చైనాలో సూపర్ హిట్!
ఈమద్య ఇండియన్ చిత్రాలకు భారీ ఆదాయ వనరుగా చైనా మారింది. బాలీవుడ్‌లో వచ్చిన ‘దంగల్, సీక్రెట్‌సూపర్‌స్టార్, టాయిలెట్, భజరంగీ భాయిజాన్’ వంటి చిత్రాలు అక్కడ అద్భుతమైన కలెక్షన్లు సాధించాయి. దీనిని బట్టి చైనీయులు ఏ తరహా చిత్రాలు ఎక్కువ ఇష్టపడతారో అర్దమవుతోంది. అదే ‘బాహుబలి’ చిత్రాన్ని మాత్రం చైనీయులు పెద్దగా ఆదరించలేదు. ఇక విషయానికి వస్తే కెరీర్ తొలినాళ్లలో గ్లామర్ పాత్రలు పోషించిన హీరోయిన్లు ఆ తర్వాత మాత్రం కథా ప్రాధాన్యం ఉన్న చిత్రాలనే ఒప్పుకుంటున్నారు. ఈ కోవలోకి నిన్న, నేటి బాలీవుడ్ టాప్‌స్టార్ హీరోయిన్లు అందరూ చేరుతారు. ఐశ్వర్యారాయ్ నుంచి విద్యాబాలన్, కంగనారౌనత్ వరకు ఇలా అడుగులు వేస్తున్నవారే కావడం విశేషం. ఈ కోవలోకి వచ్చే సీనియర్ హీరోయిన్ రాణిముఖర్జీ.
ఈ ఏడాది మార్చిలో ఈమె ‘హిచ్కి’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రేక్షకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లను కూడా సాధించింది. ఒక్క ఇండియాలోనే 75 కోట్లకు పైగా రాబట్టింది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల సరసన ‘హిచ్కి’ కూడా చేరింది. ఈ చిత్రం ఇప్పుడు మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈనెల 12న చైనాలో విడుదలైన ఈ మూవీ ఇప్పటికే 100కోట్లకు పైగా వసూలు చేసింది. కంటెంట్ ఉన్న చిత్రానికి భాష, ప్రాంతాలతో సంబంధం లేదని ‘హిచ్కీ’ మరోసారి నిరూపించిందని రాణిముఖర్జీ ఆనందం వ్యక్తం చేస్తోంది.
సిద్దార్ధ్ మల్హోత్రా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో రాణి ముఖర్జీ టీచర్ కావాలనే బలమైన లక్ష్యం.. అయితే నోరు తెరిచి ఏమి మాట్లాడినా వింత శబ్దాలు చేసే జబ్బు.. అన్ని అడ్డంకులను ఎదిరించి లక్ష్యం చేరుకునే పాత్ర అయిన నైనామాధూర్ పాత్రకి రాణి నిజంగానే జీవం పోసిందనే చెప్పాలి....!
By October 29, 2018 at 05:23AM
No comments