హరికృష్ణ ఉండి ఉంటేనా..?: తలసాని
వాస్తవానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అపర చాణక్యుడు. ఆయన రాజకీయ జీవితంలో పొత్తులతో తప్ప ఒంటరిగా నిలబడిన పరిస్థితిలేదు. నాడు వాజ్‌పేయ్ హవా ఉన్న సమయంలో బిజెపికి జైకొట్టి ఎన్డీఏలో ప్రముఖునిగా వెలిగాడు. తర్వాత వాజ్‌పేయ్, అద్వానీ చెప్పిన ‘ఇండియా షైనింగ్’ (భారతదేశం వెలిగిపోతోంది) అనే నినాదం చేటుని చేస్తుందని భావించి వారితో తెగతెంపులు చేసుకున్నాడు. బిజెపితో కలవడమే తన జీవితంలో అతి పెద్ద తప్పుగా పేర్కొన్నాడు మరలా వామపక్షాలకు దగ్గరయ్యాడు. కిందటి ఎన్నికల్లో ఏపీలో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ అంటే ఓటర్లు అసహ్యించుకోవడం, దేశవ్యాప్తంగా మోదీ హవా నడవడంతో పవన్‌నికూడా మచ్చికచేసుకుని కిందటి ఎన్నికల్లో వైసీపీ ఆశలపై నీళ్లు జల్లి అధికారంలోకి వచ్చాడు. మరలా మోడీ తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలు, ఏపీకి చేసిన అన్యాయం చూసి రగిలిపోతున్నప్రజల కోసం మోదీపై యుద్దం ప్రకటించాడు.
ఇందులో భాగంగా ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ఆశలు మొలకెత్తడాన్ని చూసి తెలంగాణలో కాంగ్రెస్ ఆధీనంలోని ‘మహాకూటమి’లో చేరాడు. ఇక ఏపీలో కూడా కాంగ్రెస్ ప్రత్యేకహోదా ఇస్తామని చెబుతుండటంతో కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని కాంగ్రెస్‌తో జతకట్టించేందుకు సిద్దం అవుతున్నాడు. ఎన్నికల్లో వీరి పొత్తు ఉండకపోవచ్చుగానీ కేంద్రంలో అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్‌కి సీట్లు తక్కువ అయితే మాత్రం చంద్రబాబు ఆ పార్టీకి సాయం అందించడం ఖాయం. ఇలా బాబు ఎవరిని దగ్గరకు తీసినా, దూరం పెట్టినా ఆయనలోతుగా విశ్లేషణ చేస్తారు. నేటి రాజకీయాలకు అనుగుణంగా ఏ ఎండకాగొడుగు, వీలుంటే జుట్టు, వీలు లేకపోతే కాళ్లు పట్టుకోవడంలో ఆయన సిద్దహస్తుడు. ఇక ఒకప్పటి తెలంగాణ టిడిపి నేత, తర్వాత టిఆర్‌ఎస్‌లోకి వెళ్లి మంత్రి పదవి చేపట్టిన తలసాని శ్రీనివాసయాదవ్ టిడిపి-కాంగ్రెస్‌ల పొత్తుపై ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు.
ఆయన మాట్లాడుతూ.. టిడిపి-కాంగ్రెస్ బంధంపై తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తోన్నఎన్టీఆర్ తనయుడు, బాబు బావమరిది, వియ్యంకుడు, హిందూపూర్ ఎమ్మెల్యేఅయిన బాలకృష్ణ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాడు. దీనిపై ఖచ్చితంగా బాలకృష్ణ ఆలోచించి కాంగ్రెస్‌తో టిడిపి పొత్తు కరెక్టా? కాదా? అనేది స్పష్టం చేయాలి. ఇంతకన్నా నేనేమీ వ్యాఖ్యలు చేయలేను. అదే హరికృష్ణ బతికి ఉంటే దీనిపై స్పందించేవాడు. తెలంగాణలో ఏర్పడింది మహాకూటమి కాదు.. అది ఓ ముఠా. సిద్దాంతాలకు తిలోదకాలు ఇచ్చిన పార్టీలు ఏర్పరచుకున్న దొంగల ముఠా.
తెలుగు వారి ఆత్మగౌరవమే ముఖ్యంగా ఏర్పడిన కేవలం సీట్ల కోసమే కాంగ్రెస్‌తో కలిసి నడుస్తోంది. టిడిపిని చంద్రబాబు కాంగ్రెస్ తాకట్టుపెట్టాడు. కాంగ్రెస్, కోదండరాం, టిడిపి, సిపిఐలు మహాకూటమిగా ఏర్పడిన పెద్దగా ఫరక్ (ప్రభావం)పడదు. ఈ కూటమిలో టిడిపి ఉండటమే దారుణం. దీని ప్రభావం ఏపీ ఎన్నికలపై పడుతుందని వివరించారు. నిజమే.. హరికృష్ణ ఉండి ఉంటే ఖచ్చితంగా ఖండించేవాడు. ఎందుకంటే రాష్ట్ర విభజనను వ్యతిరేకించి విభజనకు అనుకూలమని రాసిన లేఖని జీర్ణించుకోలేక ఏకంగా రాజ్యసభ ఎంపీ స్థానానికే హరికృష్ణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
By October 04, 2018 at 02:03PM
Read More
No comments