Breaking News

'అజ్ఞాతవాసి' బ్లాక్ బస్టర్ హిట్!


అదేమి చిత్రమో గానీ ఈమధ్యకాలంలో విపరీతంగా దక్షిణాది చిత్రాల హిందీ డబ్బింగ్‌ వెర్షన్స్‌కి యూట్యూబ్‌లలో, డిజిటల్‌ మీడియాలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇది నిర్మాతలకు అదనపు ఆదాయ వనరుగా మారింది. పెద్దగా కథాబలం లేని అల్లుఅర్జున్‌ 'సరైనోడు' హిందీలో ఒక సంచలనం సృష్టించి, అద్భుత ఆదరణ చూరగొంది. ఇక తెలుగులో పవన్‌కళ్యాణ్‌ కెరీర్‌లోనే కాదు.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కెరీర్‌లో కూడా హ్యాట్రిక్‌ మూవీగా తెరకెక్కి, విడుదలకు ముందు సంచలనాలు క్రియేట్‌ చేస్తుందని ఆశించిన 'అజ్ఞాతవాసి' చిత్రం డిజాస్టర్‌ అయింది. ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు, విమర్శకులు, పవన్‌, త్రివిక్రమ్‌ల వీరాభిమానులు కూడా దీనిని బాగా విమర్శించారు. ఎన్నడు లేని విధంగా ఈ చిత్రం వల్ల త్రివిక్రమ్‌ , పవన్‌లు పలు విమర్శలు, ఒక విధంగా చెప్పాలంటే ఏనాడు ఎదుర్కోని విమర్శలను ఎదుర్కొన్నారు. అసలు ఈ చిత్రం తెరకెక్కించింది, డైలాగ్స్‌ రాసింది త్రివిక్రమేనా? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తే, మరికొందరు ఈ చిత్రం చూసి పవన్‌కి నటనపై ఆసక్తిలేదని తెలిసిపోతోందని, ఆయన నటనలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు. 

కానీ అదే సమయంలో ఈ చిత్రాన్ని హిందీలోకి డబ్‌ చేసి డబ్బింగ్‌ వెర్షన్‌ని అక్టోబర్‌ 20న యూట్యూబ్‌లో విడుదల చేశారు. దీనికి విశేషమైన స్పందన లభించింది. కేవలం 24 గంటలలోనే దీనిని 9.4కోట్ల మంది వీక్షించారు. అంతేకాదు.. ఇప్పటివరకు 1.6కోట్ల మంది ఈ చిత్రాన్ని వీక్షించగా, దాదాపు 2లక్షల పైచిలుకు మంది సినిమా నచ్చిందని లైక్‌ చేయడం విశేషంగా చెప్పాలి. హిందీలోకి డబ్‌ చేసి, యూట్యూబ్‌లో విడుదల చేసిన దక్షిణాది చిత్రాలలో అతి తక్కువ కాలంలో అత్యధిక వ్యూస్‌ లభించిన చిత్రంగా ఇది రికార్డులను క్రియేట్‌ చేసింది. కాగా హిందీలో ఈ చిత్రం టైటిల్‌ 'ఎవడు 3' కావడం మరో విశేషం. 

ఈ ఏడాది సంక్రాంతికి తెలుగులో విడుదలై భారీ నస్టాలను చవిచూసిన ఈ చిత్రం నిర్మాత, హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ అధినేత రాధాకృష్ణ అలియాస్‌ చిన్నబాబుకి తీవ్ర నష్టాలను తెచ్చిపెట్టినా, తాజాగా త్రివిక్రమ్‌ -ఎన్టీఆర్‌ల 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం నాన్‌-బాహుబలి రికార్డుల వైపు దూసుకుపోతూ ఉండటం, 'అజ్ఞాతవాసి' హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌కి యూట్యూబ్‌లో లభిస్తున్న ఆదరణ రాధాకృష్ణకి బాగానే ఊరటనిచ్చి ఉంటాయనే చెప్పాలి. 



By October 25, 2018 at 06:45AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43168/pawan-kalyan.html

No comments