నాన్నకు చెప్పలేకపోయా..మీకు చెప్తున్నా:ఎన్టీఆర్
ఎన్టీఆర్ హీరోగా శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన చిత్రం ‘అరవింద సమేత’. వీర రాఘవ ట్యాగ్‌లైన్. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్. అక్టోబర్ 11న సినిమా విడుదలవుతుంది.
ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘‘12 ఏళ్ల నా కల త్రివిక్రమ్‌గారితో సినిమా చేయాలన్నది. చాలా సార్లు అనుకున్నాం. ఎలా చేస్తే బావుంటుంది అని ఆలోచించేవాళ్లం. ఎప్పుడూ కుదరలేదు. ప్రతిసారీ ఏదో ఒక చిన్న అడ్డంకి వస్తుండేది. అదేంటో నాకు అర్థం కాలేదు. ఆయనకు కూడా అర్థం కాలేదు. ఆయన ‘నువ్వే నువ్వే’ సినిమా తీయకముందు నుంచీ, నాకు చాలా దగ్గరైన మిత్రుడు. ఇదెందుకు కుదరడం లేదు... కష్టసుఖాలన్నీ మాట్లాడుకోగల మంచి మిత్రులం అని చాలా సార్లు నేను అనుకున్నా. నాతో పాటు అభిమాన సోదరులు కూడా అనుకున్నారు.. ఇదెందుకు జరగడం లేదని. నా జీవితంలో నెల క్రితం జరిగిన ఘటనకు ఇది చాలా ముడి పడి ఉందేమో.. ఆయనతో చిత్రం మొదలుపెట్టిన తర్వాతే.. బహుశా నెల క్రితం జరిగిన ఇన్సిడెంట్స్ వల్లే బహుశా.. జీవితం విలువ నాకు అర్థమైంది. ఈ సినిమా తాత్పర్యం ఒకటే... ఆడిదైన రోజు ఎవరైనా గెలుస్తాడు. కానీ యుద్ధం ఆపిన వాడే మగాడు, వాడే మొనగాడు. మనం జీవితంలో చాలా మందికి తెలిసో, తెలియకో చాలా బాధలు, చాలా గొడవలు ఉంటాయి. కానీ జీవితం అంటే.. కొట్టుకోవడం, తిట్టుకోవడం కాదు.. జీవితమంటే బతకడం. ఎలా బతకాలో చెప్పే సినిమా ‘అరవింద సమేత.. వీరరాఘవ’. మనిషిగా పుట్టినందుకు ఎలా హుందాగా ఉండాలో, మనిషిగా పుట్టినందుకు ఎంత ఆనందంగా బతకాలో, మనిషిగా పుట్టినందుకు .. మనిషిగా బతకాలో చెప్పేదే ‘అరవింద సమేత వీరరాఘవ’. ఈ టైటిల్ పెట్టినప్పుడు టైటిల్ పవర్‌ఫుల్‌గా లేదని చాలా మంది అనుకున్నారు. ఒక మగాడి పక్కన ఓ ఆడదానికన్నా బలం ఇంకేదీ ఉండదు. ఒక గొప్ప సినిమా నేను చేయాలనే, జీవితం విలువ తెలుసుకోవడానికే, నాకు ఆ పరిపక్వత రావడానికే దేవుడు బహుశా ఆగి ఈ రోజు ఆయనతో సినిమా చేయించాడేమో.. చాలా థాంక్స్ స్వామీ (త్రివిక్రమ్). అంటే 12 ఏళ్లు ఆయనలో ఓ స్నేహితుడిని, ఓ దర్శకుడినీ చూశా. ఈ సినిమా పూర్తయ్యేలోపు ఓ ఆత్మబంధువును చూశా. రేపొద్దున నాకు ఎలాంటి కష్టం వచ్చినా, నాకు ఎన్ని దుఃఖాలు వచ్చినా, మీ అందరితో పాటు నిలుచునే వాడే మా త్రివిక్రమ్. థాంక్స్ ఎలాట్ స్వామీ.. ఈ సినిమా నా జీవితంలో తప్పకుండా ఓ మైలురాయిలా నిలిచిపోతుందని అభిమాన సోదరుల ముఖంగా చెబుతున్నాను. ఇప్పటిదాకా ఈ మాటను నేను చెప్పలేదు. ఇది నా 28వ చిత్రం. 27 సినిమాల్లో ఎప్పుడూ చిత్రంలో తండ్రికి చితి అంటించే సీన్‌ను ఏ దర్శకుడూ పెట్టలేదు. కానీ ఈ సినిమాలో మరి యాదృచ్ఛికమో, మరి అలా జరిగిందో తెలియదు. మనం అనుకునేది ఒకటీ.. పైన వాడు రాసేది ఒకటి అని అంటారు కదా.. ఈ నెల రోజులు నాకో అన్నలాగా, నాకు తండ్రిలాగా, నాకు మిత్రుడిలాగా నాకు తోడుగా ఉన్నారు త్రివిక్రమ్. ఆయనకు చాలా థాంక్స్. కొన్ని బంధాలు కలిసినప్పుడు సక్సెస్‌ఫుల్‌గా వాళ్లు చేసిన ప్రయత్నం ఉంటే, ఆ బంధం కొనసాగుతుందని అంటారు. ఈ బంధాన్ని మా నాన్నగారు పై నుంచి చూస్తున్నారు. ఈ బంధాన్ని ఆయన సక్సెస్‌ఫుల్ చేస్తారని నమ్ముతున్నాను.
ఈ సినిమాకు తమన్ కాకుండా వేరే మ్యూజిక్ డైరక్టర్ ఎలా చేసేవాడనే ఊహ కూడా నాకు అందడం లేదు. అంటే.. మీ అందరికీ తమన్ కేవలం వాయిద్యాలు వాయించాడని అనిపించవచ్చు. కానీ, తమన్ తన ప్రాణం పెట్టాడు ఈ సినిమాకు. చాలా మంది ఈ సినిమా ఆడియో విడుదల అయినప్పుడు.. ఎన్టీఆర్ మాస్ హీరో కదా.. డ్యాన్సులు ఉండే పాటలు లేవేంటని అన్నారు. అందరికీ నేను చెప్పేది ఒకటే. డ్యాన్సర్ కన్నా ముందు నేను ఓ నటుడిని. నటనలో భాగమే డ్యాన్స్ తప్ప, డ్యాన్స్ లో భాగం నటన కాదు. అలాంటి ఒక నటుడి కోసం ఆయన రాసిన సినిమాకు పూర్తిగా తమన్ తప్ప, వేరే ఎవడూ న్యాయం చేయలేరని నేను సభా ముఖంగా చెబుతున్నాను. అహర్నిశలూ తను ఎంత కష్టపడ్డాడో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో నాకు తెలుసు. మీ అందరికీ ఏం కావాలో ఆయనకు (త్రివిక్రమ్)కి తెలుసు. ఆయనకు ఏం కావాలో తమన్‌కి తెలుసు. అందుకోసం తనెంత తపన పడ్డాడో నాకు తెలుసు. ఈ సినిమాకు సంగీతపరంగా ప్రాణం పోసినందుకు తమన్‌కి థాంక్స్. ఈ సినిమాలో ప్రతి పాటా ఒక సీన్‌గా ఉంటుంది. ఈ సినిమాలో ప్రతి పాటా ఓ సందేశాన్ని.. చిత్రం యొక్క సన్నివేశాలను తెలుపుతుంది. అలాంటి పాటలను డిజైన్ చేసినందుకు త్రివిక్రమ్‌గారికి, చేసినందుకు తమన్‌కి, రాసినందుకు గురువుగారు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారికి, నాకు అత్యంత ఇష్టమైన రామజోగయ్యశాస్త్రిగారికి ధన్యవాదాలు.
త్రివిక్రమ్‌కీ, నాకూ మధ్య ఫ్రెండ్‌షిప్‌కి ఓ పిల్లర్. ఆ పిల్లర్ మా అరవింద సమేత సినిమా కాదు, వేదిక కాదు.. ఇంకేదో కాదు. రాధాకృష్ణగారు. ఓ సినిమా గురించి ఓ నిర్మాత పడే తాపత్రయాన్ని నేను ఆయనలో చూశాను. నేను డబ్బులు పెట్టేశాను కదా, సినిమా తీసేశాను కదా, దాన్ని అమ్మేశాను కదా.. అని కాకుండా, ఆ ఆలోచనలన్నీ పక్కనపెట్టి సినిమాను ఎలా తీయాలి? సినిమా ఎంత బాగా రావాలి? అని అనలైజ్ చేసే చాలా తక్కువ మంది నిర్మాతల్లో రాధాకృష్ణగారు ఒకరు. ఈ సినిమా చాలా బాగా రావడానికి ఆయన కూడా ఒకరు. సితార, దేవయాని, నాగబాబు, శుభలేఖ సుధాకర్, రావు రమేశ్, పూజా, ఈషా.. ఇలా ప్రతి ఒక్కరికీ థాంక్స్. వాళ్ల ప్రాణం పెట్టి ఈ సినిమాకు పనిచేశారు. ఈసినిమాకు ఇంత ఎనర్జీని తెచ్చినందుకు వాళ్లతో పాటు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. మా బాబు... జగపతిబాబు ఈ సినిమాలో ఆయన చేసిన పాత్ర రేపొద్దున సినిమా విడుదలైన తర్వాత అర్థమవుతుంది. జగపతిబాబుగారు లేకపోతే, అరవింద సమేత వీరరాఘవ లేదు. గొప్ప కథానాయకుడిని గురించి చెప్పాలంటే, గొప్ప ప్రతి కథానాయకుడిని చూడాలి. జగపతిబాబును పొద్దున చూస్తే రాత్రి కల్లోకి వచ్చేస్తారని మా సునీల్ చెప్పారు. నేను బాబుకు చాలా బాగా కనెక్ట్ అయ్యా. కానీ అరవింద సమేత వీరరాఘవ చూసినప్పుడు మా అరవింద సమేతకు మరో పిల్లర్ నవీన్ చంద్ర అని అంటారు. అంత బాగా చేశాడు.
నెల రోజుల నుంచి చాలా విషయాలు మనసులో పెట్టుకుని ఉన్నాను. అంటే వాటిని ఎలా మాట్లాడాలో, ఎలా చెప్పాలో కూడా తెలియదు. మేమిద్దరం మాట్లాడటం మానేసిన కారణం ఏంటంటే.. ఇలాంటి విషయాల్లో మనిషి బతికున్నప్పుడు విలువ తెలియదు. మనిషి పోయాక విలువ తెలుసుకోవాలంటే, మనిషి మన మధ్య ఉండడు. తన తండ్రికి అంతకన్నా అద్భుతమైన కొడుకు ఉండడు. కొడుక్కి అంత కన్నా అద్భుతమైన తండ్రి ఉండడు. ఒక భార్యకి అంతకన్నా అద్భుతమైన భర్త ఉండడు. మనవడికి, మనవరాలికి అంతకన్నా అద్భుతమైన తాత ఉండడు. బ్రతికి ఉన్నంత వరకు ఎన్ని సార్లో నాకు, మా అన్నకు చెప్పాడో నాకు తెలుసు.. ‘నాన్నా.. మనమేదో చాలా గొప్పవాళ్లం అని కాదు. ఒక మహానుభావుడి కడుపున నేను పుట్టాను. నా కడుపున మీరు పుట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనల్ని మోసుకెళ్లేది అభిమానులే. బ్రతికున్నంత వరకు.. నాన్నా అభిమానులు జాగ్రత్త. మనం వాళ్లకు ఏం చేయకపోయినా.. వాళ్లు మనకు ఏం చేస్తున్నారో.. నాకు తెలుసు. నాన్నా.. అభిమానులు జాగ్రత్త’ అని చాలా సార్లు అనేవారు. ఈ ఒక్క సినిమాకు ఆయన ఉండి ఉంటే బావుండేది. మనకు ఆయన అవసరం ఎంతుందో కానీ, పైన ఆయనకు (ఎన్టీఆర్)కు ఆయన (హరికృష్ణ) అవసరం ఎంత ఉందో తెలియదు మరి. చాలా సార్లు ఆడియో వేడుకల్లో తాతగారి బొమ్మను చూసేవాడిని. కానీ నాన్నగారి బొమ్మ అంత త్వరగా అక్కడికి వస్తుందని నేను ఊహించలేదు. భౌతికంగా మన మధ్య లేకపోయినా, అభిమానులు అందరి గుండెల్లో, అందరి ముఖాల్లో ఆయన్ని చూస్తున్నాను. మా నాన్నకి ఇచ్చిన మాటనే మీ అందరికీ ఇస్తున్నాను ఈ రోజు. మా జీవితం మీకు (అభిమానులకు) అంకితం. చివరిగా ఒక్కమాట.. నాన్నకు చెప్పలేకపోయా.. మీ అందరికీ చెబుతున్నా.. జాగ్రత్తగా వెళ్లండి..’’ అని అన్నారు.
By October 05, 2018 at 01:15PM
Read More
No comments