నేను మాట్లాడే సందర్భం కాదిది: త్రివిక్రమ్
అభిమానుల ఆనందోత్సాహాల మధ్యన.. నందమూరి హరికృష్ణ అకాల మరణంతో... ఎంతో బాధలో ఉన్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల హృదయాలు బరువెక్కిన వేళ, అన్నదమ్ముల కన్నీళ్ల మధ్యన అరవింద సమేత ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. హారిక హాసిని క్రియేషన్స్ లో త్రివిక్రమ్ దర్శకుడిగా తెరకెక్కిన అరవింద సమేత - వీర రాఘవ సినిమా విడుదలకు సిద్దమయ్యింది. అందులో భాగంగానే అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. అలాగే ఈ ఈవెంట్ లో అరవింద సమేత ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. ఇక ట్రైలర్ తో సినిమా మీద అంచనాలు పెంచేస్తే.. అరవింద ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం కాస్త భారంగానే నడిచింది.
ఈవెంట్ ఆసాంతం అన్నదమ్ములు కన్నీటి పర్యంతమవడం.. కళ్యాణ్ రామ్ ఎమోషనల్ స్పీచ్ తో పాటుగా.. ఎన్టీఆర్ కన్నీళ్లు, అతని బాధ.. అలాగే తండ్రి మరణంతో తేరుకోని ఎన్టీఆర్ మాట్లాడిన మాటలతో అరవింద సమేత వేదిక బరువెక్కింది. ఇక దర్శకుడు త్రివిక్రమ్ కి మాటల మాంత్రికుడిగా పేరుంది. త్రివిక్రమ్ మాటలంటే చెవులు కోసుకునే అభిమానులుంటారు. ఏదో అజ్ఞాతవాసి సినిమా పోయిందని త్రివిక్రమ్ ని తక్కువ అంచనా వెయ్యలేం. అలాగే త్రివిక్రమ్ రాసే మాటలే కత్తుల్లా ఉండవు.. ఆయన మాట్లాడిన మాటలు అంతే అర్ధవంతంగా అందంగా ఉంటాయి. అసలు మాములుగా త్రివిక్రమ్ ఎక్కువగా స్టేజ్ మీద మాట్లాడాడు. కానీ మట్లాడడం మొదలు పెడితే.. త్రివిక్రమ్ స్పీచ్ కి పడిపోవాల్సిందే.
ఏదైనా ఆడియో వేడుక మీద త్రివిక్రమ్ మాట్లాడాడు అంటే.. ఆ మాటలు పదే పదే వినాలనిపించేలా ఉంటాయి. హృదయానికి దగ్గరగా... మనసుకు ఆహ్లాదంగా మాట్లాడగల నేర్పరి త్రివిక్రమ్. అలాంటి త్రివిక్రమ్ అరవింద సమేత ప్రీ రిలీజ్ వేడుకలో మాటలు రాని మౌన మునిలా కనిపించాడు. స్టేజ్ ఎక్కి మైక్ ముందుకొచ్చిన త్రివిక్రమ్ మాటలు వెతుకున్నాడు అనేకన్నా.. హరికృష్ణ మరణంతో ఉన్న ఎన్టీఆర్ ని ఓదార్చే ప్రయత్నంలో బరువెక్కిన హృదయంతో మాట్లాడలేకపోయాడనడం కరెక్ట్. కొన్నిసార్లు మాట్లాడడం కంటే మాట్లాడకపోవడమే ఉత్తమం. ఇది నాకు అలాంటి పరిస్థితి అంటూ.. త్రివిక్రమ్ చెప్పడం అందరిని కదిలించింది.
ఎంతో కష్టమైన పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొన్న ఎన్టీఆర్‌ని అభినందిస్తూ.. అరవింద సమేతకు పనిచేసిన నటీనటులకూ, టెక్నీకల్ టీంకి అభినందలు, కృతజ్ఞతలు చెప్పిన త్రివిక్రమ్ మౌనంగా ఉండిపోయాడు. ఇక ఎన్టీఆర్ ఎమోషనల్ అయిన టైంలో ఎన్టీఆర్ ని వెన్నుతట్టి భుజం మీద చెయ్యేసి నేనున్నాని పక్కన నిలబడిన త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ అభిమానులు కృతఙ్ఞతలు తెలుపుతున్నారు. ఎన్టీఆర్ ఈ ఈవెంట్ లో త్రివిక్రమ్ గురించి చెప్పినట్టు నిజంగా ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ అన్నలా, ఆత్మీయుడిలా, నాన్నలా వెన్నంటి ఉన్నాడనిపించింది.. ఈవెంట్ లో ఎన్టీఆర్ దగ్గరగా త్రివిక్రమ్ ని చూసిన వారికీ.
By October 05, 2018 at 01:08AM
Read More
No comments