అఖిల్ మళ్లీ యాక్షన్‌నే నమ్ముకుంటున్నాడా?
అక్కినేని ఫ్యామిలీ అంటే క్లాస్, లవ్, అత్తాఅల్లుళ్ల సవాల్ వంటి క్లాస్ అండ్ ఫ్యామిలీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి. ఏయన్నార్‌కి ఇలాంటి క్లాస్, కుటుంబ కధ, భక్తి పాత్రలు మరపురానివిగా నిలిచిపోయాయి. ఇక నాగార్జున విషయానికి వస్తే 'విక్రమ్' వంటి చిత్రంతో కెరీర్‌ని స్టార్ట్ చేసి తర్వాత పలు యాక్షన్ చిత్రాలు చేసినా బాగా ఆడలేదు. ఇక 'మజ్ను, గీతాంజలి' వంటి చిత్రాలలో ప్రేమికుడిగా అలరించాడు. 'శివ'తో పాటు మరికొన్ని యాక్షన్, మాస్ చిత్రాల ద్వారా కూడా ఆకట్టుకున్నాడు.'హలో బ్రదర్, అల్లరి అల్లుడు, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం' వంటి చిత్రాలలో అదరగొట్టాడు. ఇక ఆయన పెద్ద కుమారుడు కాలేజీ బ్యాక్‌డ్రాప్‌తో చేసిన జోష్ సరిగా ఆడలేదు. మాస్ హీరోగా చేసిన 'తడాఖా' హిట్ అయినా అందులో ఆయన సోలో హీరో కాదు. 'ఆటోనగర్ సూర్య, బెజవాడ' వంటి చిత్రాలలో నటించినా అవి కూడా ఆడలేదు. 'ఏమాయచేశావే, ప్రేమమ్' వంటి క్లాస్ చిత్రాలతో సక్సెస్ కొట్టాడు.
ఇక అఖిల్ విషయానికి వస్తే తన మొదట చిత్రమే వివి వినాయక్ దర్శకత్వంలో 'అఖిల్' అనే భారీ యాక్షన్, లోకాన్నిరక్షించే యోధునిగా కనిపించాడు. ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత తన తండ్రి నాగార్జున సలహా మేరకు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో 'హలో' అనే లవ్ విత్ యాక్షన్ మూవీ చేశాడు. పాజిటివ్ టాక్ వచ్చినా పెద్దగా కమర్షియల్ హిట్ కొట్టలేదు. ప్రస్తుతం ఆయన వరుణ్‌తేజ్, రాశిఖన్నాలతో తొలి చిత్రం 'తొలిప్రేమ'తో పెద్ద హిట్ కొట్టి యంగ్ టాలెంట్ దర్శకునిగా పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరితో 'మిస్టర్ మజ్ను'లో నటిస్తున్నాడు. 'తొలిప్రేమ' చిత్రాన్ని నిర్మించిన భోగవల్లి ప్రసాదే దీనికి కూడా నిర్మాత. గతంలో భోగవల్లి, నాగచైతన్యకి 'దోచెయ్' వంటి ఫ్లాప్ ఇచ్చాడు. మరి ఈ చిత్రంతో ఆయన అఖిల్‌కి ఎలాంటి హిట్ ఇస్తాడో వేచిచూడాల్సివుంది. ఇక ఈ చిత్రం తర్వాత అఖిల్ వినాయక్‌ని మించిన యాక్షన్ చిత్రాలు, హైఓల్టేజ్ హీరోయిజం చూపించే బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో చేయనున్నాడట. అంటే అఖిల్ నాలుగో చిత్రం బోయపాటితోనే ఉంటుందని అంటున్నారు. నాగ్ కోరిక మేరకు బోయపాటి కథను సిద్దం చేసుకుంటున్నాడని చెబుతున్నారు.
ప్రస్తుతం బోయపాటి రామ్‌చరణ్‌తో ఓ చిత్రం చేస్తున్నాడు. దీని వెంటనే ఆయన బాలయ్యతో మరో చిత్రం చేస్తాడట. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తి కావడంతో బాలయ్య మూవీని రెండు మూడు నెలలలో పూర్తి చేసి ఆతర్వాత అఖిల్ నాలుగో చిత్రం చేస్తాడని సమాచారం. అంటే దీనికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. మరి వినాయక్‌లా కాకుండా బోయపాటి అఖిల్‌ని పవర్‌ఫుల్ మాస్ హీరోగా ఎలా చూపిస్తాడనేది ఆసక్తికరమేనని చెప్పాలి.
By October 18, 2018 at 02:37PM
No comments