Breaking News

ANKURARPANAM PERFORMED_ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ


Tirumala, 9 October 2018: The sacred event of Ankurarpanam, heralding the commencement of the Srivari Brahmotsavam, was performed with religious fervour in Tirumala on Tuesday evening.

Ankurarpanam ritual commenced only after the second bell and Nivedana to Sri Venkateswara Swamy.

Later kalasha sthapanam took place in the Taga shala located on the Southern end of the Bagaru baavi for Ankurarpanam which is also known as beejavapanam.
TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju, Board Members Sri GSS SIVAJI, Sri Rudraraju Padma Raju, Incharge CVSO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh and others took part.





















ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుమల, 09 అక్టోబరు 2018: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు మంగళవారం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. ఏదైనా ఉత్సవానికి 9 రోజుల ముందుగానీ, ప్రధాన ఉత్సవానికి 7, 5, 3 రోజుల ముందుగానీ అంకురార్పణ నిర్వహిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.

అంకురార్పణ ఘట్టం కోసం ముందుగా యాగాశాలలో శ్రీ సీతారామలక్ష్మణులు, శ్రీహనుమంతుడు, శ్రీ సుగ్రీవుడు, శ్రీ అంగదుడు, శ్రీ అనంతుడు, శ్రీ గరుడాళ్వార్‌, శ్రీ చక్రత్తాళ్వార్‌, శ్రీ విష్వక్సేనుల వారిని వేంచేపు చేశారు.

సేనాధిపతి ఉత్సవం :

శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు శ్రీ విష్వక్సేనుడు. ఈ సందర్భంగా శ్రీ విష్వక్సేనులవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేపట్టారు. జగద్రక్షకుడైన శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శ్రీ విష్వక్సేనులవారు ఈ విధంగా మాడ వీధుల్లో ఊరేగుతారని ప్రాశస్త్యం.

అంకురార్పణ క్రమం :

విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగించారు. అత్రి అనే మహర్షి తన ‘సముర్తార్చన అధికరణ’ అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు. ముందుగా భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో నవధాన్యాలు చల్లారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహించారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠించారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగింది.

అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరించి బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేశారు. ఆ తరువాత హోమం ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను, అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానతోపాటు మొత్తం 49 మంది దేవతలను ఆవాహన చేశారు. ఆ తరువాత షోడశోపచార పూజలు నిర్వహించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



By TTD News October 09, 2018 at 08:08PM

Read More

No comments