Breaking News

లక్ష కాదు ఈసారి వర్మ 10 లక్షల ఆఫర్!


రాంగోపాల్‌వర్మ ఏది చేసినా అది వివాదమో.. సంచలనమో అయి చివరకు ఆయన చిత్రాలకు ప్రారంభం నుంచి ప్రమోషన్‌గా ఉపయోగపడుతుంది. కాగా ఆయన త్వరలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం చేస్తానని ప్రకటించాడు. ఈనెల 19వ తేదీన ఈ చిత్రం వివరాలను తిరుపతిలో వెల్లడిస్తానని చెప్పాడు. ఇక ఈ చిత్రానికి రాకేష్‌ రెడ్డితో పాటు ముంబైకి చెందిన ఓ పారిశ్రామికవేత్త నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఆయన ఓ హోటల్‌లో అచ్చు చంద్రబాబు నాయుడులా ఉన్న ఓ సర్వర్‌ ఫొటోని పోస్ట్‌ చేసి అతని వివరాలు చెబితే లక్షరూపాయల పారితోషికం ఇస్తానని ప్రకటించాడు. ఓ మీడియా చానెల్‌కి చెందిన రోహిత్‌ అనే జర్నలిస్ట్‌ అతని వివరాలను వర్మకి తెలియజేయడంతో టైటిల్‌ ముందు థ్యాంక్స్‌ కార్డ్‌తో పాటు లక్షరూపాయల ప్రైజ్‌మనీని కూడా వర్మ అతనికి ఇచ్చేశాడని తెలుస్తోంది. 

ఇక తాజాగా వర్మ మరో ప్రకటన చేశాడు. అచ్చు లక్ష్మీపార్వతిని వివాహం చేసుకునే ముందు ఎన్టీఆర్‌లా ఉన్న వ్యక్తి పేరును సూచిస్తే ఏకంగా 10లక్షల బహుమానం ఇస్తానని పేర్కొన్నాడు. ఇక గతంలో ‘రక్తచరిత్ర’ చిత్రంలో వర్మనే ఎన్టీఆర్‌ పాత్రను శత్రుష్నుసిన్హా చేత చేయించి సక్సెస్‌ అయ్యాడు. మరోవైపు బాలీవుడ్‌ దర్శకుడు, నటుడు మహేష్‌ మంజ్రేకర్‌లో కూడా ఎన్టీఆర్‌ పోలికలు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా ఒకప్పుడు నల్లపూసల బాబ్జి దర్శతకత్వంలో వచ్చిన ‘ఎన్టీఆర్‌నగర్‌’ చిత్రంలో బాలకృష్ణకి డూప్‌గా నటించిన నటుడు అచ్చు ఎన్టీఆర్‌లానే ఉంటాడు. ప్రస్తుతం ఆయనే కత్తి కాంతారావు బయోపిక్‌లో కూడా ఎన్టీఆర్‌ పాత్రను పోషిస్తున్నాడు. 

మరి వీరిలో ఎవరినైనా తీసుకుంటాడా? లేక తన అన్వేషణను కొనసాగిస్తాడా? అనేది వర్మ ఆలోచనని బట్టి తెలియాల్సివుంది. మరీ ముఖ్యంగా ఇందులో లక్ష్మీపార్వతిగా ఎవరు నటించనున్నారు? అనేది మరింత ఆసక్తికరంగా మారింది.



By October 19, 2018 at 06:17AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43074/ram-gopal-varma.html

No comments