Breaking News

Ukraine War రష్యాకు భయపడి మా భూభాగాన్ని వదులుకోం: ఉక్రెయిన్ కీలక ప్రకటన


ఉక్రెయిన్‌ తూర్పున ఉన్న డొనెటస్క్, లుగాన్స్క్‌లకు స్వతంత్ర హోదాను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉక్రెయిన్‌ను మూడు ప్రాంతాలుగా ముక్కలు చేసినట్లైయింది. అప్పటికే ఉన్న ఉక్రెయిన్‌కు తోడు.. డొనెట్స్క్‌,లుహాన్స్క్‌ ప్రాంతాలు దేశాలుగా ఏర్పడినట్లు రష్యా గుర్తించింది. అంతేకాదు, ఆ కొత్త దేశాల్లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు శాంతి పరిరక్షక దళాల పేరిట రష్యా సేనలను పంపించాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. అసలు ఉక్రెయిన్‌ ఉనికినే పుతిన్‌ ప్రశ్నించడం పశ్చిమ దేశాలను భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఓ వైపు యుద్ధాన్ని నివారించేందుకు దౌత్యపరంగా ప్రయత్నాలు సాగుతుంటే.. మరోవైపు సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రష్యాపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలీడిమిర్ జెలెన్స్కీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మంగళవారం తెల్లవారుజామున జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. రష్యా శాంతి చర్చలను ధ్వంసం చేసిందని మండిపడ్డారు. అయితే, తమ భూభాగాన్ని వదులుకోబోమని పేర్కొన్నారు. అంతేకాదు, కవ్వింపు చర్యలకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రష్యా మద్దతు ఉన్న రెండు వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్రంగా రష్యా అధికారికంగా గుర్తించిన తర్వాత ఉక్రెయిన్ శాంతి, దౌత్యానికి కట్టుబడి ఉందని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. రష్యాకు వ్యతిరేకంగా తన మిత్రదేశాల నుంచి స్పష్టమైన, సమర్థవంతమైన చర్యలను ఉక్రెయిన్ ఆశించింది. ఉక్రెయిన్, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ నాయకుల అత్యవసర శిఖరాగ్ర సమావేశానికి పిలుపునిచ్చింది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ చొరవతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అంగీకరించారు. ఇదో సానుకూల పరిణామమని అందరూ భావిస్తున్న తరుణంలో.. తమ భూభాగంలోకి చొరబడిన ఐదుగురు ఉక్రెయిన్‌ చొరబాటుదారులను మట్టుబెట్టామని రష్యా ప్రకటించింది. ఇదే సమయంలో రెండు ప్రాంతాలకు స్వతంత్ర హోదాను కట్టబెట్టింది. డొనెట్స్క్‌, లుగాన్స్క్‌లను అధికారికంగా గుర్తించామని పుతిన్‌ చేసిన ప్రకటన.. పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చేసింది.


By February 22, 2022 at 11:10AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/ukraine-president-volodymyr-zelenskiy-slams-russia-formally-recognized-separatist-regions/articleshow/89741337.cms

No comments