Breaking News

Putin wealth పుతిన్ విలాసపురుషుడే.. ఆయన ఆస్తి అన్ని వేల కోట్లా!


రష్యాను గత రెండు దశాబ్దాలకుపైగా ఏకఛత్రాధిపత్యంతో వ్లాదిమిర్ పుతిన్‌ పాలిస్తున్నారు. అయితే, ఆయన ఆస్తిపాస్తులు, విలాసవంతమైన జీవితం, అందమైన ప్రియురాళ్లు, ఆయన కార్లు, ఖరీదైన యాట్లు.. ఇవన్నీ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి. అనధికారిక లెక్కల ప్రకారమే పుతిన్‌ ఆస్తులు దాదాపు రూ.20 వేల కోట్ల దాకా ఉంటాయని అంచనా. పుతిన్‌ నివసించే విలాసవంతమైన భవంతి విలువ దాదాపుగా రూ.2 వేలకోట్ల దాకా ఉంటుందని ఉంటుందని చెబుతారు. అధ్యక్షుడిగా ఆయనకు వేతనంగా నెలకు దాదాపు కోటి రూపాయలు అందుతుంది. నిజమో, అబద్ధమో తెలియదుగానీ.. 43 విమానాలు, నాలుగు యాట్లు (విలాసవంతమైన పడవలు), 700 కార్లు, 15 హెలికాప్టర్లు, బంగారు టాయిలెట్‌తో కూడిన జెట్‌ విమానం, రూ.50 కోట్ల విలువైన చేతిగడియారాలు ఆయన వద్ద ఉన్నట్టు కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. గతేడాది ప్రపంచంలోని సంపన్నుల బాగోతాన్ని బయటపెట్టిన పండోరా పేపర్లలోనూ పుతిన్ పేరు బయటకు వచ్చింది. పుతిన్ ఆయన సన్నిహితులు పనామా, దుబాయ్, మొనాకో, స్విట్జర్లాండ్, కేమన్ ఐలాండ్స్, బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ వంటి దేశాల్లో గుట్టుగా ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.నల్ల సముద్రం సమీపంలో 170 ఎకరాల స్థలంలోని 190,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పుతిన్‌కు విలాసవంతమైన రహస్య ప్యాలెస్ ఉందని ఇటీవల పుకార్లు షికార్లు చేశాయి. రష్యాలో అతిపెద్ద ప్రైవేట్ నివాసంగా పేరుపొందిన ఈ సముదాయంలో 27,000 చదరపు అడుగుల గెస్ట్ హౌస్, యాంఫీ థియేటర్, ప్రొఫెషనల్ క్యాలిబర్ ఐస్ హాకీ రింక్, వేగాస్ తరహా క్యాసినో, స్ట్రిప్పర్ పోల్స్‌తో కూడిన నైట్‌క్లబ్, నీటికి ఎదురుగా భూగర్భంలో ఓ గది ఉన్నాయి.బాత్‌రూమ్‌లలో 850 డాలర్ల విలువైన ఇటాలియన్ టాయిలెట్ బ్రష్‌లు, 1,250 డాలర్ల ఖరీదైన టాయిలెట్ పేపర్ హోల్డర్‌లు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీని విలువ కనీసం 1.4 బిలియన్ డాలర్లు ఉంటుందని అంటున్నారు. 1952లో రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌‌ (నాటి లెనిన్ గ్రాడ్) లో జన్మించిన పుతిన్‌ చిన్నవయసులోనే జూడో, రష్యా యుద్ధకళ అయిన సాంబో నేర్చుకున్నారు. ఎప్పటికైనా రష్యా గూఢచార సంస్థ (కేజీబీ)లో చేరాలని ఆ వయసులోనే నిర్ణయించుకున్నారు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ హైస్కూల్లో విద్యను అభ్యసించిన పుతిన్‌.. లెనిన్‌గ్రాడ్‌ స్టేట్‌ యూనివర్సిటీలో లా చదివి.. పీహెచ్‌డీ కూడా పూర్తిచేశారు. 1975లో కేజీబీలో చేరి 1990 దాకా అందులోనే కొనసాగారు. ఈ సమయంలోనే జర్మనీలో అండర్‌కవర్‌ ఏజెంట్‌‌గా పనిచేశారు. ఇక, 1991లో కేజీబీకి రాజీనామా చేసిన పుతిన్‌ మళ్లీ లెనిన్‌గ్రాడ్‌కు చేరుకున్నారు. అప్పటికి ఆ నగర మేయర్‌గా పనిచేస్తున్న తన గురువు అనతొలీ సోబ్‌చాక్‌ వద్ద విదేశీ వ్యవహారాల సలహాదారుగా చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1998 నాటికి అప్పటి అధ్యక్షుడు బోరిస్‌ ఎల్త్సిన్‌ విశ్వాసం చూరగొని ఫెడరల్‌ సర్వీసెస్‌ బ్యూరో చీఫ్‌ అయ్యారు. ఎల్త్సిన్‌ పుతిన్‌ను తన రాజకీయ వారసుడిగా భావించేవారు. ఈ క్రమంలోనే 1999 డిసెంబరు 31న ఎల్త్సిన్‌ తన పదవికి రాజీనామా చేయడంతో పుతిన్‌ రష్యా యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ అయ్యారు. తర్వాత 2000 ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడయ్యారు. చెచెన్‌ తిరుగుబాటుదారులను ఉక్కుపాదంతో అణచివేయడం ద్వారా పాలనపై తనదైన ముద్ర వేశారు. రెండో చెచెన్‌ వార్‌తో ‘మ్యాన్‌ ఆఫ్‌ యాక్షన్‌’గా పేరు తెచ్చుకున్న పుతిన్.. సోవియట్‌ విచ్ఛిన్నం తర్వాత నిస్తేజంగా మారిన రష్యాను దూకుడుగా నడుపుతున్న ఆయన వ్యవహారశైలి యువతకు బాగా నచ్చింది. దీంతో ఆయనకు బ్రహ్మరథం పట్టడంతో 2004లో పుతిన్‌ మరోసారి దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విమర్శించిన మీడియాపై ఉక్కుపాదం మోపడం ద్వారా తనను విమర్శించేవారే లేకుండా చేసుకున్నారు. అన్ని వ్యవస్థలనూ కేంద్రీకృతం చేసి, తన ఏకఛత్రాధిపత్యం కిందికి తీసుకొచ్చారు. రష్యా రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి వరుసగా మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టకూడదు. అందుకే 2008లో దిమిత్రీ మెద్వెదేవ్‌ను ఎన్నికల్లో పోటీ చేయించి గెలిపించారు. తాను ప్రధానిగా పగ్గాలు చేపట్టి అధికారం చెలాయించారు. మెద్వెదేవ్‌ పదవీకాలం ముగియగానే 2012లో మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టారు. 2014లో క్రిమియాను రష్యాలో కలిపేయడం ద్వారా రష్యన్ల మనసు చూరగొన్నారు. మెద్వెదేవ్‌ హయాంలో రాజ్యాంగ సవరణలు చేసి అధ్యక్ష పదవీకాలం ఆరేళ్లకు పెంచారు. దీంతో 2018లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పుతినే మరోసారి గెలిచారు. అంతటితో ఆగకుండా తనకు మరో రెండుసార్లు అధ్యక్ష పదవికి పోటీచేసే వీలు కల్పించే చట్టంపై గత ఏడాదే సంతకం చేశారు. దీంతో 2036 దాకా తానే అధ్యక్షుడిగా కొనసాగడానికి మార్గం సుగమం చేసుకున్నారు.


By February 25, 2022 at 08:40AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/russian-president-vladimir-putin-live-like-a-king-on-his-extraordinary-wealth/articleshow/89815707.cms

No comments