Breaking News

మున్నాభాయ్ MBBS సినిమాలా ఉంది.. ఓ మెడికల్ కాలేజీ నివేదికపై సుప్రీం ఆశ్చర్యం


ఓ మెడికల్ కాలేజీలో మంజూరైన అదనపు సీట్లను రద్దుచేయాలని కోరుతూ జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నివేదికపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ఇది మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌ సినిమాను తలపిస్తోందని వ్యాఖ్యానించింది. ఆ వైద్య కళాశాలలోని రోగులంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటం.. పిల్లల వార్డులోని రోగుల్లోనూ ఏ ఒక్కరూ సీరియస్‌గా లేరని ఎన్‌ఎంసీ బృందం తనిఖీల్లో బయటపడటంతో అవాక్కయ్యింది. మహారాష్ట్ర ధూలే జిల్లాలోని అన్నా సాహెబ్‌ చూడామన్‌ పాటిల్‌ మెమోరియల్‌ వైద్య కళాశాలను ఈ ఏడాది జనవరి 14న ఎన్ఎంసీ బృందం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా అక్కడ రోగులంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండగా.. పిల్లల వార్డులోని రోగుల్లోనూ ఏ ఒక్కరూ తీవ్ర అనారోగ్యంతో లేరని తనిఖీలో గుర్తించారు. అంతేకాదు, అక్కడ ఆపరేషన్ థియేటర్ కాదు, కనీసం ఎక్స్‌రే మెషీన్‌లు కూడా లేకపోవడంతో విస్మయం చెందారు. ఈ నేపథ్యంలో ఆ మెడికల్ కాలేజీలో సీట్లను 100 నుంచి 150కి పెంచుతూ గతేడాది నవంబరు 25న మంజూరైన అనుమతులను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఎన్‌ఎంసీ ఆశ్రయించింది. దీనిపై జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌ల ధర్మాసనం ముందు సోమవారం వాదనలు జరిగాయి. ‘‘అవన్నీ విస్తు కలిగించే విషయాలు.. ఈ వ్యవహారమంతా మున్నాభాయ్‌ ఎంబీబీఎస్ సినిమాలా కనిపిస్తోంది. వార్డులోని రోగులంతా ఆరోగ్యంగా ఉండటం.. పిల్లల వార్డులో సీరియస్‌ రోగులు ఒక్కరూ లేకపోవడం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది’’ అని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. కాలేజీ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ.. ఎటువంటి నోటీసు లేకుండా అదీ ప్రభుత్వ సెలవు దినం మకర సంక్రాంతి రోజున తనిఖీలకు వచ్చిందన్నారు. ఈ సందర్బంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. మకర సంక్రాంతి అని చెప్పి రోగాలు ఆగిపోవు కదా.. మీ క్లయింట్ ఆ రోజున రోగులు లేరని చెప్పలేదు’ అని కౌంటర్ ఇచ్చింది. కాలేజీలో మరోసారి తనిఖీలు చేపట్టాలని, ప్రవేశాలకు అనుమతించాలని బాంబే హైకోర్టు ఎన్ఎంసీను ఆదేశించడంతో దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎంఎన్‌సీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, న్యాయవాది గౌరవ్ శర్మ వాదనలు వినిపించారు. ఆ మెడికల్ కాలేజీలో ఆపరేషన్ థియేటర్, ఎక్స్-రే యూనిట్ కూడా లేదని తెలిపారు. ఈ కాలేజీలో విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వాన్ని సంప్రదించి మిగతా కాలేజీల్లో సర్దుబాటు చేస్తామని వివరించారు. ‘‘మేము ఒక్కటి మాత్రమే ఎత్తి చూపుతున్నాం... 100 సీట్లకు అనుమతి ఇచ్చాం.. అదనంగా 50 సీట్లను కేటాయించారు.. అంటే వారు 100 సీట్లతోనే కొనసాగుతారు.. ఈ రకమైన సంస్థలో కొత్త బ్యాచ్‌ను చేర్చుకోవద్దు.. ఇప్పుడు మేము వారి గుర్తింపును రద్దు చేస్తే ప్రభుత్వంతో సంప్రదించి ఇతర కళాశాలలలో సర్దుబాటు చేస్తాం.. అంతేకానీ, కొత్త విద్యార్థులను చేర్చుకోవడం కుదరదు’’ అని వాదనలు వినిపించారు. అయితే, ఈ కాలేజీ 1992 నుంచి 100 సీట్లతో కొనసాగుతోందని అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. అలాగే, కాలేజీకు అనుమతి రద్దుచేసే అధికారం ఎన్ఎంసీకి లేదన్నారు.


By February 15, 2022 at 07:53AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-compared-to-munna-bhai-movie-on-medical-college-inspection-report/articleshow/89580560.cms

No comments