Breaking News

భారతీయుల పట్ల పొలెండ్ పోలీసులు దాష్టీకం.. కాలితో తన్ని, జుట్టుపట్టి ఈడ్చేస్తున్నారు


ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడ చదువుకోవడానికి వెళ్లిన వేలాది మంది భారతీయ విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారిని స్వదేశానికి రప్పించ్చేందుకు కేంద్ర విదేశాంగ శాఖ ‘ఆపరేషన్ గంగ’ను చేపట్టింది. ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఉక్రెయిన్ పశ్చిమ సరిహద్దుల్లోని పోలెండ్, హంగేరీ, రోమేనియాలకు రోడ్డు మార్గంలో తీసుకొచ్చి.. అక్కడ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా భారత్‌‌కు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో భారతీయ విద్యార్థుల‌పై పోలెండ్ అధికారులు, పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. పోలెండ్ స‌రిహ‌ద్దుల‌కు వ‌చ్చిన వారిపై దాడికి పాల్పడుతున్నారు. విద్యార్థుల‌ను క్యూలైన్ల‌లో నిల‌బెడుతూ ఎవ‌రైనా ప‌క్క‌కు జ‌రిగితే కాళ్ల‌తో తన్నడం, క్రూరంగా మెడ‌లు ప‌ట్టి నెట్టివేస్తున్న దృశ్యాలు టీవీల్లో, ఇంట‌ర్నెట్‌లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. మ‌రికొంద‌రిని కాళ్లు, చేతులు ప‌ట్టి ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. పోలాండ్ సరిహద్దులకు వస్తున్న వారితో రహదారులు కిక్కిరిసిపోవడంతో ర‌ద్దీని నియంత్రించే క్ర‌మంలో పోలీసులు స‌హ‌నం కోల్పోయారు. ఆప‌ద‌లో ఉన్న‌వాళ్లు అనే కనికరం లేకుండా వారిప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఆడ‌వాళ్లు కాళ్లు మొక్కితేనే సరిహద్దు దాటి రావాలని, మ‌గ‌వాళ్లు తాము చెప్పిన గేమ్ ఆడితేనే రావాల‌ంటూ పోలీసులు ష‌ర‌తులు పెట్టిన‌ట్లు బాధితులు వాపోతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావడంతో నెటిజ‌న్‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ‘‘రోజు రోజుకూ పరిస్థితి దారుణంగా మారుతోంది.. మమ్మల్ని వారు హింసిస్తున్నారు.. భారతీయ విద్యార్థులపై దాడికి పాల్పడుతున్నారు.. ఉక్రెయిన్ సరిహద్దులు దాటి పొలెండ్‌లోకి అనుమతించడం లేదు.. అమ్మాయిల్ని కూడా వేధిస్తున్నారు.. వారిని జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్తున్నారు.. కొందరు విద్యార్థినులకు గాయాలయ్యాయి’’ అని మనీశ్ చౌదరి అనే భారతీయ విద్యార్థి వెల్లడించారు. ‘‘భారతీయ ఎంబసీ అధికారులు, సిబ్బంది తమకు ఆహారం, వసతి కల్పిస్తున్నారు.. కానీ, సరిహద్దు రక్షణ దళాలు మాత్రం అడ్డుకుంటున్నాయి.. ఒకవేళ ఎవరైనా సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించినా వారిపై రాడ్లతో దాడికి తెగబడుతున్నారు.. ముఖంపై పిడిగుద్దులు కురిపిస్తున్నారు.. శనివారం మాపై కాల్పులకు కూడా జరిపారు’’ అని వాపోయాడు. మూడు రోజులపాటు పొలెండ్ సరిహద్దుల్లో నిరీక్షించి వెనక్కు వచ్చేశానని తెలిపాడు. మమ్మల్ని జంతువుల్లా వేధిస్తున్నారని వాపోయాడు. కేరళకు చెందిన విద్యార్థులపై ఉక్రెయిన్ భద్రతా సిబ్బంది దాష్టీకానికి తెగబడినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే పొలెండ్ ప్రభుత్వంతో మాట్లాడాలని ప్రధాని నరేంద్ర మోదీకి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లేఖ రాశారు. మరోవైపు, అంతకు ముందు పోలెండ్‌లోని ఇండియన్ ఎంబసీ ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయల తరలింపు ప్రక్రియకు సూచనలు చేసింది. పశ్చిమ ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులను పోలాండ్ ద్వారా భారతదేశానికి తరలిస్తున్నట్టుగా తెలిపింది. తరలింపు కోసం ఏర్పాటు చేయబడిన రాయబార కార్యాలయాల కో-ఆర్డినేట్‌లను గమనించాలని కోరింది. అందుకు సంబంధించిన ఫోన్ నెంబర్లను కూడా జత చేసింది.గూగుల్ ఫామ్‌లో వివరాలు రిజిస్టర్ చేయాలని పేర్కొంది. అటు, పోలెండ్ ప్రభుత్వం సరిహద్దు పాయింట్ ద్వారా కాలినడకన మాత్రమే జనాలు సరిహద్దు దాటడానికి అనుమతిస్తోంది. అయితే, ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ నుంచి తప్పించుకున్న భారతీయ విద్యార్థులందరినీ ఎలాంటి వీసా లేకుండానే పోలెండ్‌లోకి అనుమతించనున్నట్టుగా భారత్‌లోని ఆ దేశ రాయబారి ఆడమ్ బురాకౌస్కీ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన సోషల్ మీడియాలో ప్రకటన చేశారు.


By February 28, 2022 at 07:49AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/some-indian-students-stopped-and-assaulted-at-ukraine-poland-border/articleshow/89882169.cms

No comments