ఆ రెండు దేశాలు సంకోచించినా పుతిన్, లావ్రోస్ ఆస్తుల స్తంభనకు ఈయూ అంగీకారం
ఉక్రెయిన్ విషయంలో రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ దుందుడుకు చర్యలపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) కీలక నిర్ణయం తీసుకుంది. వ్లాదిమిర్ పుతిన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆస్తుల్ని స్తంభింపజేయడానికి అంగీకారం తెలిపింది. ఐరోపా దేశాల్లో ఉన్న వీరిద్దరి ఆస్తుల్ని స్తంభింపజేయాలని నిర్ణయించింది. తాజా ఆంక్షలను ధ్రువీకరించే ప్రక్రియపై ఈయూలోని 27 దేశాల విదేశాంగ మంత్రులు గురువారం రాత్రి చర్చలు జరిపిన తర్వాత ఈ చర్యల గురించి శుక్రవారం వెల్లడించారు. అయితే, జర్మనీ, ఇటలీ ఈ ఆంక్షల విషయంలో సంకోచించగా.. ఈయూలోని చాలా దేశాలు అనుకూలంగా ఉన్నాయని పేరు వెల్లడించడానికి నిరాకరించిన ఓ ఇద్దరు అధికారులు తెలిపారు. ఈయూ తాజా ఆంక్షలలో రష్యాకు చెందిన అత్యున్నత అధికారులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ వ్యాఖ్యానించారు. ఆర్థిక, ఇంధన, ఇతర రంగాలే లక్ష్యంగా ఆ ఆంక్షలు విధించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూయెల్ మెక్రాన్ అభిప్రాయపడ్డారు. అలాగే, బ్రస్సెల్స్‌లోని ఈయూ సమావేశానికి హాజరైన ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-వైవ్స్ లే డ్రియన్.. ఉక్రెయిన్‌పై రష్యా నిరాటంక సైనిక చర్యను బట్టి తదుపరి ఆంక్షలు విధించే అవకాశం ఉందని అన్నారు.‘‘ఇది (తాజా ఆంక్షలు) సరిపోదు.. మనం (రష్యన్) వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేయాలి.. ముఖ్యంగా ఒలిగార్చ్‌లను మరింత లక్ష్యంగా చేసుకోవాలి’’ అని పేర్కొన్నారు. అటు, రష్యా చర్యను పలు దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. జపాన్, ఐరోపా, ఆస్ట్రేలియా, తైవాన్ సహా పలు దేశాలు తీవ్రమైన ఆంక్షలకు సిద్ధమయ్యాయి. ఫ్రాన్స్ సహా దాని యూరోపియన్ మిత్రదేశాలు.. రష్యాపై కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నాయి. రష్యా పరిశ్రమలు, మిలిటరీని అదుపు చేసే లక్ష్యంతో సెమీకండక్టర్లు, ఇతర హైటెక్ ఉత్పత్తుల ఎగుమతులను ఆయా దేశాలు నియంత్రిస్తున్నాయి. రష్యా బృందాలు, బ్యాంకులు, వ్యక్తుల వీసాలను జపాన్ నిలిపివేసింది. ఇతర కఠిన ఆంక్షలను విధించింది. ఈ క్రమంలోనే జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా కీలక వ్యాఖ్యలు చేశారు. బలగాలతో ఏ దేశం సరిహద్దులను మార్చాలని చూసినా ఊరుకోబోమని హెచ్చరించారు. రష్యా చర్య కేవలం ఐరోపానే కాక ఆసియాపైనా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
By February 26, 2022 at 08:03AM
No comments